Fri Apr 11 2025 12:51:14 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ మ్యానిఫేస్టో ఈసారి ఇలా
వైసీపీ అధినేత జగన్ ఎన్నికల మ్యానిఫేస్టోను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఒక బృందం నిరంతరం పనిచేస్తుంది

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్నాయి. అయినా సరే రాజకీయ పార్టీలు ఇప్పటికే వేడి పుట్టిస్తున్నాయి. బహిరంగ సభలు, రోడ్ షోలతో పాటు మ్యానిఫేస్టోలను కూడా విడుదల చేస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే తొలి విడత మ్యానిఫేస్టోను విడుదల చేసింది. మూడు ప్రధాన వర్గాలను టార్గెట్ చేస్తూ మ్యానిఫేస్టోను చంద్రబాబు విడుదల చేశారు. మలి విడత మరో మ్యానిఫేస్టోను అక్టోబరులో విడుదల చేస్తామని చెప్పారు. అందులోనూ ఉచిత హామీలు ఎక్కువగానే కన్పిస్తాయన్నది వాస్తవం. అయితే అధికార వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళుతుంది. జగన్ కూడా త్వరలోనే నియోజకవర్గాల పర్యటనను ప్రారంభించనున్నారు.
అన్ని హంగులతో....
అయితే వైసీపీ కూడా తన మ్యానిఫేస్టోను ఈసారి అన్ని హంగులతో విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఉచితాలతో పాటు అభివృద్ధిపైన కూడా ఈసారి పకడ్బందీగా మ్యానిఫేస్టోను విడుదల చేయడానికి సిద్ధం చేయాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారట. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బృందం ఇదే పనిలో ఉందని చెబుతున్నారు. ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలపై ఈసారి కూడా వరాల జల్లును కురిపించనున్నారు. ప్రస్తుతం తాము అమలు చేస్తున్న పథకాల మొత్తాన్ని కొంత పెంచడంతో పాటు కొత్త పథకాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇందులో రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలతో పాటు యువత లబ్ది పొందేలా కొన్ని న్యూ స్కీమ్‌లను ఆ బృందం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. జగన్ జిల్లాల పర్యటనలో మ్యానిఫేస్టో అని కాకుండా వరసగా ఒక్కొక్క పథకాన్ని బయటకు చెప్పే అవకాశముందని తెలిసింది. మూడు రాజధానులలోనూ తాను చేయబోయే అభివృద్ధిని కూడా మ్యానిఫేస్టోలో వివరించనున్నారు.
మరిన్ని సంక్షేమ పథకాలను....
జగన్ ఇప్పటికే తను గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన మ్యానిఫేస్టోలో 98 శాతం పూర్తి చేశామని ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సంక్షేమ పథకాలయితే చెప్పిన తేదీకి లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా జగన్ బటన్ నొక్కుతున్నారు. ఫలితంగా జగన్ పట్ల లబ్దిదారుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఈసారి మ్యానిఫేస్టోలో మరింత జనరంజకంగా పెట్టి ఆ నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకోసమే జగన్ ఈ నాలుగేళ్ల పాటు పథకాల విషయంలో ఎలాంటి జాప్యం చేయలేదు. చెప్పింది చెప్పినట్లుగానే చేశారు. అదే ఇప్పుడు ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.
జగన్ ఆలోచనలను...
చంద్రబాబును నమ్మవద్దంటూ ఇప్పటికే స్లోగన్‌తో వైసీపీ ప్రజల వద్దకు వెళుతుంది. గత ఎన్నికల మ్యానిఫేస్టోను అమలు పర్చకుండా చంద్రబాబు ఏ ఏ వర్గాలకు దూరం అయ్యారో... వారిని ఫ్యాన్ గుర్తు నుంచి మరలకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసమే మ్యానిఫేస్టోను టీడీపీకి మించి రూపొందించాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. ఈసారి అదనంగా మరికొన్ని సంక్షేమ పథకాలు మ్యానిఫేస్టోలో కన్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్ ఇప్పటికే తన మనసులో ఉన్న కొన్ని ఆలోచనలను మ్యానిఫేస్టో రూపొందిస్తున్న బృందానికి చెప్పినట్లు తెలిసింది. ఆయన ఆలోచనలను అనుసరించే కొత్త మ్యానిఫేస్టో రూపుదిద్దుకుంటోంది. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా పలు పథకాలను జగన్ అండ్ టీం రెడీ చేస్తున్నారు. త్వరలోనే కొత్త స్కీమ్‌లతో జగన్ జనం ముందుకు వచ్చేందుకు సిద్ధమయిపోయారు.
Next Story