Sat Dec 21 2024 12:11:50 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఇన్నాళ్లకు జగనన్నకు అర్ధమయినట్లుందిగా.. అందుకే ఇలా?
వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు తెలిసి వచ్చింది. ప్రజలకు దూరమయితే తీర్పు ఎలా ఉంటుందో రుచి చూశారు
వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు తెలిసి వచ్చింది. ప్రజలకు దూరమయితే తీర్పు ఎలా ఉంటుందో రుచి చూశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు కన్నూమిన్నూ కానరాలేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకపోవడం జగన్ చేసిన అతిపెద్ద తప్పు. ప్రజలకు చేరువగా ఉండాల్సిన ముఖ్యమంత్రి దూరంగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయన్న భ్రమలో ఉండిపోయారు. క్యాస్ట్ పాలిటిక్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. డెవలెప్మెంట్ ను పక్కన పెట్టి వెల్ఫేర్ ను మాత్రమే పట్టుకుని కూర్చుని తనకు ఇదే ఎన్నికల్లో ఊతంగా నిలబడుతుందని విశ్వసించారు. అదే ఆయనతో పాటు పార్టీని కూడా కొంప ముంచింది.
పరదాల సీఎంగా...
గతంలో ఎక్కడకు వెళ్లినా ముఖ్యమంత్రి కావడంతో సెక్యూరిటీతో వెళ్లేవారు. దానిని ఎవరూ కాదనరు కానీ. పరదాల సీఎం అని ముద్రను బలంగా వేసుకున్నారు. జనం ఆయన వద్దకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు. స్పందన కార్యక్రమాన్ని అధికారులకు అప్పజెప్పారు. బటన్ నొక్కడానికి జిల్లా కేంద్రాలకు వెళ్లినప్పుడు కూడా ఆయన రాకపోకలపై అనేక ఆంక్షలు పెట్టేవారు. చెట్లు నరికే వారు. ప్రజలను ఆయన వాహనాలకు దూరంగా ఉంచేవారు. ప్రజా సమస్యల కన్నా తన భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ను జనం తమకు సమయం వచ్చినప్పుడు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయినట్లుంది. నేలమీదకు వచ్చినట్లే కనపడుతుంది.
జనంలోకి ఇప్పుడు...
ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. జనంలోకి వస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి బురద నీళ్లలో దిగుతున్నారు. జనం వద్దకు నేరుగా వెళ్లి వారిని పలుకరిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా వెంటనే అక్కడకు వెళుతూ జరిగిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. కానీ ఇదే అధికారంలో ఉన్నప్పడు మాత్రం చేయలేకపోయారు. అప్పుడు తాను ఎవరి మాటలను వినే పరిస్థితుల్లో లేరు. స్వయంగా ఆయన వెళితే పరిస్థితులు మారతాయని, అధికారుల్లో చలనం వచ్చి సరైన చర్యలు ప్రారంభిస్తారని తెలిసినా క్యాంప్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చే వారు కానీ ఆయన క్షేత్రస్థాయికి వెళ్లేవారు కాదు. ఇటీవల పిఠాపురం పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆయన పర్యటనకు మంచి స్పందన లభించడంతో ఇక జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
తప్పుదోవ పట్టించి...
దీంతో అధికారులతో పాటు పార్టీ నేతలు, మంత్రులు కూడా జగన్ ను తప్పుదోవ పట్టించేవారు. వాటిని నమ్మిన జగన్ అంతా సవ్యంగా జరుగుతుందన్న భ్రమలో ఉండేవారు. ఇలా ఐదేళ్ల పాటు పాలన సాగించిన జగన్ ఆల్ ఈజ్ వెల్ అన్న ధోరణితో మరోసారి అధికారం తమదేనన్న రీతిలో మొండిగా వ్యవహరించారు. అదే ఆయనను మాజీని చేసిందని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు జగన్ కు 2014 రోజులు గుర్తుకు వచ్చినట్లుంది. జనంలో ఉంటే తప్ప ప్రజలు ఆదరించరన్న సత్యాన్ని గ్రహించారు. అయితే ఇప్పటికే ఆలస్యమయింది జగన్ అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ రకమైన ధోరణిని జగన్ ఇప్పటికైనా మానుకుని నేతలతోనూ, జనంతోనూ మమైకమవ్వాలని క్యాడర్ కోరుకుంటుంది. మరి జగన్ చేస్తారా?
Next Story