Mon Dec 23 2024 15:53:43 GMT+0000 (Coordinated Universal Time)
చంకలు గుద్దుకుంటారా? సరి చేసుకుంటారా?
ఈరోజు వైసీపీ ప్లీనరీ ప్రారంభం కాబోతుంది. వివిధ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. చర్చ కూడా జరుగుతుంది
ఈరోజు వైసీపీ ప్లీనరీ ప్రారంభం కాబోతుంది. వివిధ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. చర్చ కూడా జరుగుతుంది. కానీ అంతా సంక్షేమమే.. అభివృద్ధి ఏదీ అన్న ప్రశ్న ఖచ్చితంగా వైసీపీ నేతకు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతుంది. అందరి మనసులో అదే ఉంది. కానీ అధినేత ముందు బయట పడలేని పరిస్థితి ఎమ్మెల్యేలది. మంత్రులు తమ నియోజకవర్గాల్లో అటో ఇటో చేసి కొన్ని అభివృద్ధి పనులు చేసుకుంటారు. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారి మాట ఎవరు వింటారు? కనీసం అధికారులు కూడా ఎమ్మెల్యేలు లెక్క చేయని పరిస్థితి
ఎమ్మెల్యేలు చాలా మంది...
అదే సమయంలో ఇటీవల వైసీపీ నియోజకవర్గాలు, జిల్లా ప్లీనరీల్లో ఎమ్మెల్యేల అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కనీసం తమ నియోజకవర్గాల్లో పనులు చేసిన కార్యకర్తలకు బిల్లులు చెల్లించుకోలేని దుస్థితిలో ఉన్నామని బహిరంగంగానే చెప్పారు. అనేక మంది బిల్లులు రాక అప్పుల పాలయ్యారని కూడా ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లకు ప్లీనరీ జరుగుతుండటంతో సహజంగానే ఈ సమస్యలకు తెరపడుతుందని అందరూ ఆశిస్తారు.
అభివృద్ధిపై....
కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూస్తే వచ్చే రెండేళ్లలోనూ జగన్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశం లేదన్నది అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. ఖజానాలో ఉన్న సొమ్ము మొత్తం జీతాలు, పింఛన్లు పోను మిగిలింది లబ్దిదారులకు అందజేయడమే ఈ మూడేళ్లు సరిపోయింది. మరో రెండేళ్లు కూడా ఇలాగే నడుస్తుందన్నది అధికారుల మాట. కానీ ప్లీనరీ పరంగా జగన్ తన నోటి నుంచి అభివృద్ధి పనులపై ఏదైనా క్లారిటీ ఇస్తారా? అన్నది అందరూ వేచి చూస్తున్నారు.
డప్పు కోవడం మినహా...
సంక్షేమ పథకాల గురించి డప్పుకోవడం తప్ప.. రాష్ట్ర అభివృద్ధిపై ఏదైనా ప్రకటన చేస్తేనే ఈ ప్లీనరీకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. సంక్షేమ పథాకాలు ఓకే. దానిని ఎవరూ వద్దనరు. అదే సమయంలో అభివృద్ధి ఊసు కూడా ఉండాలి. లేదంటే ఎప్పుడూ జగన్ రెగ్యులర్ ప్రసంగమే ఉంటే ప్లీనరీ సాదాసీదాగా జరిగినట్లే. జగన్ ప్రభుత్వానికి సమయం ఇక రెండేళ్లు మాత్రమే ఉంది. ఈ రెండేళ్లలో ఇటు పార్టీ క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని తొలగించడమో, లేదా నియోజకవర్గాల్లో అభివృద్ధి గురించి హామీ ఇస్తేనే పార్టీ వచ్చే ఎన్నికల్లో గట్టెక్కుతుంది. లేకుంటే జగన్ ను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే వెనక్కు నెడతారు.
Next Story