యూట్యూబ్ ఆ రెండు గంటలు ...?
ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ తరువాత అత్యధిక ఆదరణ పొందిన సైట్ యూట్యూబ్. యూట్యూబ్ సెకన్ ఆగితే నెటిజెన్ల ప్రాణం విలవిలాడుతోంది. అలాంటిది రెండుగంటలు నిలిచిపోతే ప్రపంచం లో ఒక్కసారి అలజడి రేగింది. అనేక దేశాల్లో నెటిజెన్ల ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. దాంతో స్థానిక పోలీసులకు లక్షల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే యూట్యూబ్ ఆగిపోతే మేమేమి చేస్తామంటూ పోలీసులు తమ అసహాయతను సైతం వ్యక్తం చేస్తూ ట్వీట్ లు చేయాలిసి వచ్చింది. ఈ సమస్యపై ఇక ట్విట్టర్ తో పాటు సామాజిక వేదికలపై ఒక్కసారిగా లక్షల్లో పోస్ట్ లు పెట్టి తమ ఆందోళన వ్యక్తం చేశారు నెటిజెన్స్.
స్పందించని యూట్యూబ్ ...
ప్రపంచంలో ఏ సైట్ ఏమైనా కానీ యూట్యూబ్ కి ఎలాంటి ఆటంకం లేకుండా రక్షణ ఛత్రాన్ని గూగుల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీన్ని ఛేదించి స్తంభింప చేయడం అసాధ్యమనే రీతిలో యూట్యూబ్ ఏర్పాటైంది. అయితే రెండుగంటల పాటు తన సేవలను యూట్యూబ్ కొనసాగించలేకపోవడానికి కారణం ఏమిటన్నది ఆ సంస్థ వెల్లడించలేదు. ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి నాలుగువందల గంటలకు పైబడి వీడియోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి.
సాంకేతిక సమస్యతోనే......
ఇటీవల ఇది మరింత పెరిగిందంటున్నారు సాంకేతిక నిపుణులు. ఈ వత్తిడి ఫలితంగా సాంకేతిక సమస్య తలెత్తి యూట్యూబ్ స్థంభించినట్లు భావిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం ముగ్గురు యువకులు ప్రారంభించిన యూట్యూబ్ ను గూగుల్ కొనుగోలు చేసింది. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టిన యూట్యూబ్ లేకపోతే ఇప్పుడు ఎవరు భరించలేనంతగా పరిస్థితి మారిపోయింది. అంతటి ఆదరణ పొందిన యూట్యూబ్ ఎదుర్కొన్న సమస్య ఏమిటన్నది ఆ సంస్థ వెల్లడించక పోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.