Wed Jan 15 2025 16:46:45 GMT+0000 (Coordinated Universal Time)
ముసిలి బ్యాచ్ ముంచేసేటట్లుందిగా..!
కాంగ్రెస్ లో వృద్ధతరం నేతల కారణంగా యువనాయకులు ఎదగలేకపోతున్నారు
కాంగ్రెస్ గెలిచినా కష్టమే. అందుకే ఓడిపోయిన దానికంటే గెలిస్తేనే ఎక్కువ మధనపడుతుంటుంది ఆ పార్టీ హైకమాండ్. ముసిలి వాసనలు వదలని పార్టీ యువతరానికి అవకాశం ఇవ్వకపోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కష్టం ఒకరిది.. సుఖం మరొకరిది అన్నట్లుగా కాంగ్రెస్‌లో ఉంటుంది. అందుకే వృద్ధతరం నేతలతో యువతరం నేతలు ఇప్పటీకీ పార్టీలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కర్ణాటకలో గెలుపు అసాధారణం. ప్రజలు కూడా అదే స్థాయిలో తీర్పు ఇచ్చారు. మూడు దశాబ్దాల తర్వాత ముచ్చటైన తీర్పు ఇచ్చినా, ప్రజల తీర్పును పక్కన పెట్టి నాయకుడి ఎన్నికపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతుంటే నవ్వాలో... ఏడవాలో తెలియని పరిస్థితి. వృద్ధతరం నేతల అనుభవం పార్టీకి అవసరం. వారి సీనియారిటీ, సిన్సియారిటీ కూడా విలువ ఇవ్వాలి. అంతే తప్ప వారిని అంతకు మించి ఆదరిస్తే అసలుకే ముప్పు వస్తుంది.
అన్ని రాష్ట్రాల్లో...
ఇది ఒక కర్ణాటకకే కాదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ కూడా అంతే. రాజస్థాన్‌లో అప్పటి పీసీీసీ ప్రెసిడెంట్ సచిన్ పైలట్ పడిన కష్టం, శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి పదవి వచ్చేసరికి ముసిలాయన అశోక్ గెహ్లాత్ తన్నుకు పోయారు. చివరకు ఏఐసీసీ అధ్యక్ష పదవి తీసుకోవాలని, చివరి ఏడాది అయినా సచిన్ పైలట్ కు అవకాశం ఇవ్వాలని చూసినా పెద్దాయన మాత్రం ససేమిరా అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవే ముద్దు అని తిష్ట వేసి మరీ కూర్చున్నారు. అశోక్ గెహ్లాత్ తో తెగేది కాదు. తెల్లారేదీ కాదు. ప్రజల్లోకి వెళ్లి పదహారు గంటలు ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు. అయినా చివరి నిమిషం వరకూ కుర్చీని వీడేందుకు ఆయన అంగీకరించడం లేదు. హైకమాండ్ కూడా ఏమీ చేయలేక వదిలేసింది. రేపు మళ్లీ రాజస్థాన్ ఎన్నికలకు సచిన్ పైలట్ దిక్కవుతారన్న దానిలో సందేహం లేదు.
యువతరానికి ఎప్పుడు?
ఇక మధ్యప్రదేశ్‌లోనూ అంతే. కమలనాధ్కు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని? పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉంటే మంత్రి పదవి ఇచ్చింది. గౌరవిచ్చింది. కానీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే అక్కడ ముఖ్యమంత్రి పదవి ఆయనకే కావాలి. వయసు మీద పడుతున్నా, చేతులు వణుకుతున్నా సరే తాను ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాల్సిందేనని భీష్మించుకుని కూర్చుకున్నారు. అనుభవజ్ఞుడే కావచ్చు. అధినాయకత్వానికి నమ్మకస్థుడే కావచ్చు. కానీ ఒక దశలో హైకమాండ్‌కు సహకరించాలి. కానీ మూతి ముడుచుకుని కూర్చుని ముసిలోడు పట్టుపట్టడంతో ఆయనకే సీఎం పదవి ఇవ్వాల్సి వచ్చింది. ఫలితంగా జ్యోతిరాదిత్య సింథియా బయటకు వెళ్లి పోవాల్సి వచ్చింది.
కర్ణాటకలోనూ అంతే....
ఇప్పుడు కర్ణాటకలోనూ అదే పరిస్థితి. డీకే శివకుమార్ నమ్మకమైన నేత. తనపై ఈడీ దాడులు చేసినా, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల చేత వేధింపులకు గురిచేసినా తట్టుకుని నిలబడ్డారు. సొంత నిధులను పార్టీ కోసం ఖర్చు పెట్టారు. శ్రమించారు. సిద్ధరామయ్య కష్టపడలేదని కాదు. ఆయన ఐదేళ్లు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ఎప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగానే ఉంటారు. కానీ డీకే కు అవకాశం ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. తనకు ఇదే చివరి ఎన్నికలు అంటూ సిద్ధరామయ్య సెంటిమెంట్‌తో అధినాయకత్వాన్ని కొడుతున్నారు. ఇలా అయితే యువతరం, బలమైన నేతలు పార్టీని నమ్మి ఎందుకు బలంగా ఉన్న బీజేపీతో పెట్టుకుంటారు. కర్ణాటకలోనైనా హైకమాండ్ తన తీరు మార్చుకోవాలన్న సూచనలు వినపడుతున్నాయి. మరి మారితే అది కాంగ్రెస్ ఎందుకవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎవరో శత్రువులు లేరు. ప్రజలు గెలిపించినా.. అధికారాన్ని నిలుపుకోలేక పోవడం దాని బలహీనత. అది అంతే. కాంగ్రెస్ అభిమానుల వేదన కూడా ఇదే.
Next Story