Sun Dec 22 2024 20:28:39 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వస్తున్నారా ? తెలంగాణ నేతల్లో కొత్త అనుమానాలు
జగన్ వ్యూహం ఏంటనేది అంతుచిక్కక టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులను రాజ్యసభకు పంపించాలని జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. రాజ్యసభ సభ్యుల ఎంపికపై జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయ నేతల్లో కలవరపాటుకు కారణమవుతోంది. జగన్ వ్యూహం ఏంటనేది అంతుచిక్కక టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులను రాజ్యసభకు పంపించాలని జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. వైసీపీలోని తెలిసిన నేతలు, పాత పరిచయస్తులతో మాట్లాడి జగన్ ఆలోచన ఏంటో ఆరా తీయడం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో ఇక స్థానాన్ని తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు జగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో స్థానాన్ని తన వ్యక్తిగత న్యాయవాది తెలంగాణలోని నిర్మల్కు చెందిన నిరంజన్ రెడ్డికి జగన్ ఇచ్చారు. ఉన్న నాలుగు స్థానాల్లో రెండు తెలంగాణ వాళ్లకు ఇవ్వడం రెండు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారింది. ఈ విషయంలో ఏపీ నుంచి విమర్శలు వస్తాయని, ఇక్కడ సమర్థులు లేరని, తెలంగాణ వారికి ఇచ్చారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని తెలిసి కూడా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, పైకి చూస్తే మాత్రం బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీని దెబ్బతీయడానికి, బీసీలను వైసీపీ వైపు మల్చుకోవడానికి ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేసినట్లే కనిపిస్తోంది. ఆర్.కృష్ణయ్య తెలంగాణకు చెందిన వ్యక్తే అయినా ఉమ్మడి ఏపీలో మూడు దశాబ్దాల పాటు బీసీల సమస్యలపై పోరాడారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ బీసీలు కూడా ఓన్ చేసుకుంటారనే ఆలోచనతో కృష్ణయ్యకు జగన్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇక, నిరంజన్ రెడ్డి జగన్ కేసులు వాధిస్తున్నారు. కష్టకాలంలో తనకు న్యాయపరంగా అండగా నిలిచారనే ఆలోచనతో ఆయనకు కూడా రాజ్యసభ సీటు ఇచ్చినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.
అయితే, పైకి ఈ విషయాలు కనపడుతున్నా జగన్ వ్యూహం ఇంకా ఏమైనా ఉందా అనే అనుమానం తెలంగాణ నేతల్లో మొదలైంది. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఈ అనుమానం ఎక్కువవుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి వైసీపీని పోటీ చేయించాలనే ఆలోచన ఏమైనా జగన్కు ఉందా ? అని తెలంగాణ నేతలు అనుమానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జగన్కు ఇప్పటికీ మంచి రాజకీయ సయోధ్య ఉందని టీ నేతలు నమ్ముతున్నారు.
వచ్చే ఎన్నికల్లో కనుక తెలంగాణలో వైసీపీ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక బీసీ నేతకు, ఒక రెడ్డి సామాజకవర్గానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీట్లు ఇవ్వడం ద్వారా ఈ వర్గం ఓట్లను చీల్చాలనే వ్యూహం ఏదైనా ఉందా అనే ఆందోళన తెలంగాణ నేతల్లో ఉంది. అయితే, తెలంగాణలో ఇక తమ పార్టీ పోటీ చేయదని జగన్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ వైసీపీ పోటీ చేయకపోయినా షర్మిల పార్టీ అయిన వైటీపీకి అనుకూల పరిస్థితులు కల్పించడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు కూడా తెలంగాణ నేతల్లో ఉన్నాయి.
Next Story