జగన్ మరో భారీ పథకం... కుటుంబానికి లక్ష
మరో సంక్షేమ పథకానికి జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది
మరో భారీ సంక్షేమ పథకానికి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనిపై అధికారులు కసరత్తు పూర్తి చేసినట్లు సమచారం. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కింద నగదును అంద చేయనున్నారు. పెళ్లికానుకగా ఈ నగదును రాష్ట్ర ప్రభుత్వం నూతన దంపతులకు అందజేయాలని నిర్ణయించింది. వైఎస్సార్ కల్యాణమస్తు పథకం కింద ఎస్సీలు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు, ఎస్సీలు కులాంతర వివాహం చేసుకుంటే లక్షన్నర ప్రభుత్వం ఇవ్వనుంది.
అక్టోబరు 1నుంచి....
ఇక ఇదే పథకం కింద వివాహం చేసుకున్న ఎస్టీలకు లక్ష రూపాయలు, కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు 1.20 లక్షలు అందచేయనున్నారు. బీసీలకు కూడా వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం కింద యాభై వేలు ఇవ్వనున్నారు. కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75 వేలు ఇవ్వనుంది. మైనారిటీలకు షాదీ ముబారక్ పథకం కింద లక్ష రూపాయలు చెల్లించనున్నారు. ఈ పథకాలను అక్టోబరు 1వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించాలని భావిస్తుంది. ఇందుకు మార్గదర్శకాలను కూడా అధికారులు తయారు చేస్తున్నారు.
దివ్యాంగులు....
దివ్యాంగులు వివాహం చేసుకుంటే 1.5 లక్షలు చెల్లించనుంది. భవన నిర్మాణ కార్మికులు వివాహం చేసుకుంటే నలభై వేలు ప్రభుత్వం ఇస్తుంది. అమ్మాయిల వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు ఉండాలి. ఈ నిబంధనలను ఉత్తర్వుల్లో పొందుపర్చారు. ఈ కొత్త పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం పథకాలను నిర్వహిస్తుంది.