Mon Dec 23 2024 11:20:30 GMT+0000 (Coordinated Universal Time)
మరో ఎంపీకి నో టిక్కెట్
వైఎస్ జగన్ పార్లమెంటు సభ్యులకు ఈసారి టిక్కెట్ కేటాయించే విషయంలో కొంత క్లారొటీకి వచ్చారు
వైసీపీ అధినేత జగన్ విశాఖపై ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. వచ్చే సెప్టంబరు నెల నుంచి తాను అక్కడి నుంచే కాపురం పెడతానని కూడా చెప్పేస్తున్నారు. పాలన కూడా అక్కడి నుంచేనని పదే పదే అంటున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్నది జగన్ లక్ష్యం. అయితే ఆ ఉద్దేశ్యం నెరవేరుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే విశాఖ నేతలు జగన్ కు తలనొప్పిగా మారారు. ఏదో చేద్దామనుకుంటే... మరేదో అయ్యేలా ఉంది అక్కడి పరిస్థితి. జగన్ విశాఖలో పాలన ప్రారంభించే ముందే అనేక వివాదాలు నేతలు తెచ్చిపెడుతుండటం ఇప్పుడు పార్టీకి మాత్రమే కాదు ప్రభుత్వానికి.. స్వయంగా ముఖ్యమంత్రికి కూడా ఇబ్బందిగా పరిణమించింది.
వ్యాపారమే....
విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ స్వతహాగా బిల్డర్. ఆయన అంతకు ముందు కూడా విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు చేసుకునే వారు. అయితే ఆయన వ్యవహారశైలి జగన్ కు కూడా మింగుడు పడటం లేదు. బిజినెస్ కావాలా? పాలిటిక్స్ కావాలా? అంటే సత్యనారాయణ మాత్రం తనకు బిజినెస్ మాత్రమే కావాలని అనేరకంగా అనిపిస్తున్నారు. రాజకీయం కన్నా ఆయనకు వ్యాపారమే కలసి వచ్చి ఉండవచ్చు. సత్యనారాయణ రాజకీయాలను లైట్ గా తీసుకుని... బిజినెస్ ను సీరియస్ గా తీసకున్నారనిపిస్తుంది. అందుకే వ్యాపార వ్యవహారాల్లో తరచూ ఆయన కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు.
పోటీ చేయాలన్న ఆలోచన...
వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలన్న ఆలోచన ఎంవీవీలో కనిపించడం లేదు. తాను పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నగరాన్ని వదిలి పొరుగురాష్ట్రమైన హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటానని చెప్పడం పార్టీని డ్యామేజీ చేయడమే. ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టడమే. కానీ ఎంవీవీ ఏమాత్రం సంకోచించడం లేదు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. వ్యాపార లావాదేవీల వల్లనే కిడ్నాప్ తతంగం జరిగినప్పటికీ అది రాజకీయంగా ప్రభుత్వానికి చుట్టుకుంది. పైగా తనకు ఇక్కడ మైనింగ్ కు అనుమతులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపైనే ఎంవీవీ సత్యనారాయణ ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా...
దీంతో వైసీపీ అధినేత జగన్ ఎంపీ ఎంవీవీపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్న ఆయన తీరును వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. దీంతో విశాఖ పార్లమెంటు స్థానానికి వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని జగన్ పోటీకి దింపుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంవీవీకి ఈ విషయం అర్థమయ్యే అలా వ్యవహరిస్తున్నారనే వారు కూడా లేకపోలేదు. విశాఖ పార్లమెంటు స్థానంలో గత ఎన్నికల్లో లక్కీగా ఎంవీవీ వైసీపీ నుంచి గెలుపొందారు. ట్రయాంగల్ ఫైట్ లో స్వల్ప ఓట్ల తేడాతోనే ఆయన బయటపడగలిగారు. కానీ ఈసారి అలా కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన అలయన్స్ ఉంటే విశాఖలో వైసీపీ నెగ్గుకురావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
సామాజికవర్గం పరంగా...
అందునా ఎంవీవీ సత్యనారాయణ అయితే బలహీనమైన అభ్యర్థి అవుతాడని జగన్ సయితం భావిస్తున్నారు. దీనికి వివాదాలు కూడా తోడయ్యాయి. దీంతో విశాఖ ఎంపీ అభ్యర్థిని మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లే చెబుతున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం నుంచి విశాఖ, విజయవాడ పార్లమెంటు స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులగా బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన పొట్లూరి వరప్రసాదరావుకు ఈసారి టిక్కెట్ ఇవ్వడమూ కష్టమే. అదే సమయంలో ఎంవీవీ సత్యనారాయణను కూడా పక్కన పెడతారంటున్నారు. వైసీపీ ఎంపీలలో ఒకే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఆ సామాజికవర్గాన్ని నిర్లక్ష్యం చేసినట్లే అవుతుంది. కానీ విజయవాడలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెట్ ఇచ్చి విశాఖలో మాత్రం బలహీన వర్గాలకు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వైసీపీ అధినేత వద్ద ఉందంటున్నారు. ఎంవీవీ సత్యనారాయణకు మాత్రం ఈసారి టిక్కెట్ కష్టమేనన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరి చివరి నిమిషంలో ఏం జరుగుతుందనేది చూడాలి.
Next Story