Mon Dec 23 2024 10:51:47 GMT+0000 (Coordinated Universal Time)
కాన్ఫిడెన్షియల్ సర్వే.. వైసీపీకి తిరుగులేదట
జగన్ తరచూ పార్టీ పరిస్థితిపై అంచనాలు తెలుసుకుంటున్నారు. ఐ ప్యాక్ సంస్థ చేత ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు
వైసీపీ అధినేత జగన్ ఫుల్ కాన్ఫిడెన్స్ గా కన్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు తమదేనన్న ధీమాతో ఆయన ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం కావచ్చు. జగన్ ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు రెండేళ్ల ముందు నుంచే సిద్ధమవుతున్నారు. ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బలమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంత ఓటు బ్యాంకుతో బలంగా ఉన్న జగన్ మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ఏర్పడినా తన గెలుపునకు ఢోకా లేకుండా చేసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
పార్టీ పరిస్థితిపై...
జగన్ తరచూ పార్టీ పరిస్థితిపై అంచనాలు అందుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందుగా ఐ ప్యాక్ సంస్థ చేత ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. సర్వేలు కూడా చేయిస్తున్నారు. సర్వే నివేదిక ప్రకారం ఆయన తాను ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇండియా టుడే, ఇండియా టీవీ, టైమ్స్ నౌ సర్వేల్లోనూ వైసీపీకే అత్యధిక స్థానాలు లభించాయి. ఇతర సంస్థల మీద ఆధారపడకుండా సొంతంగా సర్వేలు చేయించుకుని లోటుపాట్లను తెలుసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు, అవసరమైతే చర్యలు తీసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
160 స్థానాల వరకూ...
ఇటీవల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనన కోణంలో ఐ ప్యాక్ సంస్థ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. ఈ సర్వేలో వైసీపీకి 142 నుంచి 160 స్థానాల వరకూ వచ్చే అవకాశముందని తేలిందని తెలిసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధించే అవకాశముందని తేలింది. పార్టీ అంతర్గతంగా వచ్చిన నివేదిక ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో కొంత బలహీనంగా ఉన్నట్లు తేలింది. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ వైసీపీకి కొంత తక్కువ స్థానాలు వచ్చే అవకాశమున్నట్లు సర్వేలో తేలింది. దీంతో అర్బన్ ప్రాంతాలపై జగన్ ఫోకస్ పెంచనున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
అర్బన్ ప్రాంతంలో...
రానున్న రెండేళ్ల కాలంలో అర్బన్ ప్రాంతంలో ఓటర్లను ఆకట్టుకునే దిశగా కొన్ని చర్యలుండే అవకాశముంది. ఐ ప్యాక్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీకి గత ఎన్నికల మాదిరిగానే తిరుగులేదని తేలింది. అయితే కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కొంత పార్టీ ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేల్లో వెల్లడయినట్లు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐ ప్యాక్ సంస్థ సర్వే చేసి జగన్ కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సర్వేల ప్రకారమే జగన్ యాక్షన్ ఉంటుందన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Next Story