Sun Dec 22 2024 23:37:20 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలమ్మా.. ఈ కష్టం.. దేనికి?
తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించారు. 3,500 కిలోమీటర్ల పాదయాత్రపూర్తి చేశారు. మహిళగా ఎంతో కష్టపడుతున్నారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించారు. 3,500 కిలోమీటర్ల పాదయాత్ర ఇప్పటికి పూర్తి చేశారు. మహిళగా ఎంతో కష్టపడుతున్నారు. ఎండనక, వాననక ప్రజల్లో తిరుగుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదు చేసి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. రాజన్న రాజ్యం తెస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెబుతున్నారు.
ఇన్నేళ్లవుతున్నా...
అయితే పార్టీ పెట్టి ఇన్నేళ్లవుతున్నా వైఎస్ షర్మిల పార్టీలోకి కొత్తగా చేరిన వారు ఎవరూ లేరు. నాయకులు అనే వారు ఎవరూ ఇటు వైపు చూడటం లేదు. కాంగ్రెస్ నుంచి అనేక మంది వైఎస్సార్టీపీలోకి వస్తారని షర్మిలమ్మ పార్టీ పెట్టినప్పుడు తొలుత భావించారు. కానీ ఇన్ని రోజులవుతున్నా కీలక నేతలు ఎవరూ ఇటువైపు రాలేదు. బీజేపీలోకి, టీఆర్ఎస్ లోకి వెళుతున్నారు తప్పించి వైఎస్సార్టీపీలోకి మాత్రం వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఎన్నికలకు ముందు ఎవరైనా వస్తారేమో తెలియదు కానీ ఇప్పటికే కొందరు నేతలు పార్టీలో చేరి ఉండాల్సిందన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.
పొత్తు కుదుర్చుకునే...
వైెఎస్సార్టీపీతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ పొత్తు పెట్టుకోదు. 119 నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా సరైన నాయకత్వం అన్ని నియోజకవర్గాలు లేదు. కాంగ్రెస్ కూడా అన్ని నియోజకవర్గాల్లో బలంగా లేదు. సరైన నాయకుడి కోసం వెదుక్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్టీపీకి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరన్న ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ లో ఉన్న అతి కొద్ది మంది నేతల్లో ఎదురవుతుంది. ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. కేవలం ఏడాది మాత్రమే సమయం ఉంది.
ఏడాదిలో ఏదో జరిగిపోతుందని....
ఈ ఏడాదిలో ఎవరో వచ్చి వైఎస్సార్టీపీలో చేరి అనూహ్యంగా పార్టీకి హైప్ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇప్పటి వరకూ పాలేరులో మాత్రమే తాను పోటీ చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. మిగిలిన 118 నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులు దొరకాలంటే సాధ్యం కాని పని. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల కత్తిమీద సాము చేస్తున్నారనే అనుకోవాలి. ఇంత కష్టం పడినా ఫలితం ఎలా ఉంటుందన్న ప్రశ్న పార్టీ నేతలనే పట్టిపీడిస్తుంది. భవిష్యత్ ఉందని అనుకుంటేనే ఎవరైనా పార్టీలో ఉంటారు. లేకుంటే ఉన్న వారు సయితం జారు కుంటారన్నది జగమెరిగిన సత్యం. మరి షర్మిలమ్మ ఏ మేరకు రాజకీయంగా తెలంగాణలో అడుగులు వేస్తారన్నది కాలమే చెప్పాలి.
Next Story