Mon Dec 23 2024 08:30:12 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలమ్మ ఆ సాహసం చేస్తారా?
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతుంది. అయితే సాధ్యం కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం
ఎన్టీఆర్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఏం జరిగింది? తనకు అన్యాయం జరిగిందని ఏపీ అంతా తిరిగినా ఆయనకు మద్దతు లభించలేదు కదా? ఆ తర్వాత ఎన్టీఆర్ వారసుడు హరికృష్ణ అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏం చేశారు? ఏం సాధించారు? ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా పార్టీ పెట్టి చెయ్యి కాల్చుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ ఘటనలు మన కళ్ల ముందే జరిగాయి. మరి ఇప్పుడు వైఎస్ షర్మిల ఏపీలో పార్టీ పెట్టి ఏం సాధించబోతున్నారు?
అలా చెప్పినా...
నిజానికి నిన్న మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు వైఎస్ షర్మిల స్పందించారు. తనంతట తానుగా పార్టీ పెడతానని షర్మిల చెప్పలేదు. ఏపీలో పార్టీ పెడతారా? అన్న ప్రశ్నకు మాత్రం ఎందుకు పెట్టకూడదనే స్పందించారు. నిజానికి తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల ఇప్పటికీ కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆ పార్టీలో చేరేవాళ్లే లేరు. గట్టు రామచంద్రరావు లాంటి నేతలు చేరినా పార్టీకి పెద్దగా ఉపయోగం లేదు. తెలంగాణలో షర్మిలను ఏపీ వాసిగానే చూస్తారు. షర్మిల తెలంగాణ రాజకీయాలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం అయితే లేదు.
జగన్ తో విభేదించి..
ఇక ప్రచారం జరుగుతున్నట్లు అన్న జగన్ తో విభేదించి మరో పార్టీ పెట్టినా షర్మిల సాధించేదేమీ ఉండదు. ఎందుకంటే జగన్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నారు. పైగా అధికారంలో ఉన్నారు. ఆయనను ఎదుర్కొనలేక ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ చంద్రబాబే సతమతమవుతున్నారు. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ఏపీ వాసులు జగన్ నే చూస్తారు. రెడ్డి సామాజికవర్గంలోనూ వైఎస్ షర్మిలకు మద్దతు లభించడం కష్టమే.
విజయమ్మ పరిస్థితి ఏంటి?
ఇద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులైనా షర్మిలను జగన్ సోదరిగానే చూస్తారు. జగన్ పార్టీ ఉండగా ఆమెను ముఖ్యమంత్రిగా అంగీకరించే పరిస్థితి ఉండదు. దానికి కారణాలు కూడా అనేకం. జగన్ వద్ద అన్ని అస్త్రాలు ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికపరంగా, క్షేత్రస్థాయిలో క్యాడర్ పరంగా జగన్ ను ఢొకొట్టడం చెల్లెలుకు సాధ్యం కాకపోచ్చు. పార్టీ పెడితే విజయమ్మ ఏపీలో ఎవరికి మద్దతు ఇస్తారన్నది కూడా ఆసక్తికరం. కొడుకును వదులుకునేందుకు ఏ తల్లీ ఇష్టపడదు. ఇన్ని ఈక్వేషన్ల మధ్య షర్మిల పార్టీ కేవలం ఊహాగానంగానే చూడాల్సి ఉంటంంది. అందుకే షర్మిల విలేకర్ల ప్రశ్నకు సమాధానంగా రాజకీయ పార్టీ పెడితే తప్పేమిటని ప్రశ్నించారు తప్పించి ఏపీలో కొత్త పార్టీ పెట్టే సాహసం చేయకపోవచ్చు. అదే చేస్తే ఆమె పై ఉన్న ఇమేజ్ కు కూడా ఇబ్బంది కలగవచ్చు.
Next Story