Sun Dec 22 2024 01:12:41 GMT+0000 (Coordinated Universal Time)
ఏవండీ ఆవిడొచ్చేసింది
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఎవరు ఎప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఎవరు ఎప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారన్న ఉత్కంఠ నెలకొంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చిచ్చురేపిన ఈ హత్యకు గల అసలు కారణమేంటన్నది ఇప్పటి వరకూ బయటకు రాలేదు. బెంగళూరు సెటిల్మెంట్ అని కొందరు... రాజకీయ హత్య అని మరికొందరు.. కాదు కాదు.. ఇది ముమ్మాటికీ అక్రమ సంబంధం కారణంగా జరిగిన హత్యేనని ఇంకొందరు చెబుతున్నారు. సీబీఐ మాత్రం ఇప్పటి వరకూ రాజకీయ హత్య కోణంలోనే వివేకా మర్డర్ ను చూస్తుంది. హత్య జరిగిన వెంటనే ఆధారాలను చెరిపేశారన్న ఏకైక కారణం మీదనే సీబీఐ ఇప్పటి వరకూ నడిచింది.
అనేక కోణాలున్నా...
అయితే అనేక కోణాలు ఈ హత్య కేసులో వెలుగులోకి వచ్చినా ఆ దిశగా ఎందుకు విచారణ చేయడం లేదన్న ప్రశ్న ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. వైఎస్ సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారంటూనే ఆమెకు అన్ని రాజకీయ పక్షాలు అండగా నిలిచాయి. నిజానికి వైఎస్ కుటుంబమే ఇక్కడ ఒంటరిగా మొన్నటి వరకూ మిగిలిపోయింది. తాము వైఎస్ వివేకాను ఎందుకు చంపుతామని, అప్పటికే తనకు ఎంపీ టిక్కెట్ కన్ఫర్మ్ అయిందని వైఎస్ అవినాష్ రెడ్డి చెబుతున్నారు. ఆయన సీబీఐకి మాత్రమే కాకుండా తొలి సారి బహిరంగంగా వివేకా ద్వితీయ వివాహాన్ని తెరపైకి తెచ్చారు. ఇన్నాళ్లూ కుటుంబం పరువు పోతుందన్న కారణంతో తాము బయటపెట్టడం లేదని, కానీ నిందను మోయడం ఇష్టం లేక ఇక చెప్పడం తప్పని పరిస్థితి అని వైఎస్ అవినాష్ రెడ్డి అంటున్నారు.
తొలిసారి బయటపెట్టి...
ఆయన గత మూడు రోజుల నుంచి సీీబీఐ విచారణకు హాజరవుతున్నారు. ఆయన తండ్రి భాస్కర్రెడ్డి కూడా ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. చివరకు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపైన కూడా వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించారంటే కుటుంబం రెండుగా చీలిపోయిందనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో అసలు నిజం ఏంటన్నది సామాన్య ప్రజలకు కూడా అర్థం కాని విషయం. పులివెందులలో మాత్రం వైఎస్ వివేకా హత్య ఒకే కోణంలో చర్చ జరుగుతుంది. కానీ బయటే పలు రకాల చర్చలు, ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చివరకు ముఖ్యమంత్రి జగన్ కు కూడా ఈ హత్యలో ప్రమేయం ఉందంటూ కొంత ప్రచారం కూడా సాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ మౌనంగానే ఉన్నారు. వైఎస్ కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి తర్వాత గౌరవించేది వైఎస్ వివేకానందరెడ్డిని మాత్రమే అలాంటిది తాము ఎందుకు సొంత బాబాయిని చంపుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు.
రెండో భార్యగా...
ఇదిలా ఉండగా తాజాగా వివేకానందరెడ్డి రెండో భార్య స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. వైఎస్ వివేకా రెండో భార్యత షమీమ్ సీబీఐకి తాజా మూడు పేజీల స్టేట్మెంట్ ఇచ్చింది. 2010 లో తనను వివేకా పెళ్లి చేసుకున్నారని, . 2015 లో తమకు షెహన్ షా పుట్టాడని ఆమె తెలిపారు. వివేకా కు దూరం గా ఉండాలని సునీత రెడ్డి అనేక సార్లు తనను బెదిరించేదని, హత్యకు కొన్ని గంటల ముందు ఫోన్ లో తనతో మాట్లాడాడరని కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. బెంగళూరు భూ సెటిల్మెంట్ లో ఎనిమిది కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పారని షమీమ్ సీబీఐకి తెలిపింది. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, తమను దూరం పెట్టారని ఆమె ఆరోపించారు. అనేకసార్లుర్లు శివ ప్రకాష్ రెడ్డి తనను బెదిరించారని తెలిపారు. వివేకానందరెడ్డి చనిపోతే తాను వాళ్లకు భయపడి అక్కడకు వెళ్లలేకపోయానని కూడా ఆమె తెలిపారు. మరి ఇందులో ఏది నిజం అన్నది సీబీఐ అన్ని కోణాల్లో విచారించాల్సి ఉంటుంది. అప్పుడే అసలు నిందితులు ఈ కేసులో బయటకు వస్తారు.
Next Story