Mon Dec 23 2024 07:51:50 GMT+0000 (Coordinated Universal Time)
ఓటమి మంచిదేనట.. ఎందుకంటే?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ఇవి సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడుతుంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ఇవి సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో పాటు ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చేదు అనుభవాన్ని చవి చూసింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి పాలయ్యారు. ఫలితంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు. ఓటమి రోజున కొంత బాధపడినప్పటికీ తర్వత అది మన మంచికేననంటూ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. హైకమాండ్ ఆలోచనల్లో మార్పు రావడం ఖాయమన్న వాదన ఎమ్మెల్యేల్లో వినిపిస్తుంది.
గతంలోనూ...
ఓటమితో గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు తమ తప్పులు తెలుసుకున్నాయి. సాధారణ ఎన్నికలకు సమాయత్తమయి గెలిచిన సందర్భాలూ లేకపోలేదు. 2004లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచినా ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసింది. ఆ ఓటమి 2009లో తిరిగి గెలవడానికి ఉపయోగపడిందని ఉదహరిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలతో జగన్ కూడా నిత్యం నేరుగా సమావేశమై క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటారని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఇక ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో జగన్ లో మార్పును కోరుకుంటున్నారు.
టీడీపీ రంకెలు వేస్తున్నా...
మరోవైపు మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ గెలవడంతో టీడీపీ నేతలు 2024లో ఇక అధికారం తమదేనన్న ధీమాలో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు అనుసరించిన తీరు మాత్రం విమర్శలకు గురైంది. సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది. నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారంటూ వైసీపీ చేసిన ప్రచారం గ్రౌండ్ లెవెల్లో బలంగా వెళుతుంది. పేద నుంచి చదువుకున్న వారు కూడా చంద్రబాబును సమర్థించడం లేదు. పైగా చంద్రబాబుకు ఇది తొలి నుంచి అలవాటేనంటూ సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఫైర్ అవుతుండటం టీడీపీకి సాధారణ ఎన్నికల్లో నష్టం చేకూరుస్తుందంటున్నారు.
జనసేన కూడా...
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎమ్మెల్సీ గెలుపుపై స్పందించలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేనాని ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో జరిగిన తంతుపై మాత్రం మౌనంగానే ఉన్నారు. పవన్‌కు కూడా చంద్రబాబు చేసింది నచ్చకపోవడం వల్లనే సైలెంట్‌గా ఉన్నారంటున్నారు. అది పొత్తు వద్దనుకునేంత కాకపోయినా చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక మరోసారి పవన్‌ను టచ్ చేసి ఉంటుందని చెబుతున్నారు. ఇక టీడీపీ నేతలు కూడా జబ్బలు చరుస్తూ ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తామని రంకెలు వేస్తుండటాన్ని జనసేన నేతలు గమనిస్తున్నారు. అయితే ఓటమి పాలయినా తమకు వచ్చే నష్టం ప్రత్యేకంగా ఏమీ లేదని, వచ్చే ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలయితే ఇక భూస్థాపితమేనని హెచ్చరిస్తున్నారు.
Next Story