Mon Dec 23 2024 14:40:06 GMT+0000 (Coordinated Universal Time)
నేరుగా చెబితే గాని జగన్ కు అర్థం కాదేమో?
సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఉన్నది ఉన్నట్లు చెబుతారు.
నిర్మొహమాటంగా చెప్పేవారే నిజమైన మిత్రులు. అలాగే నిజాలు మొహం మీద చెప్పేవారు శత్రువులు కాదు. ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో నిజాలు చెప్పేవారిని మిత్రులుగానే చూడాలి తప్ప శత్రువులుగా పరిగణించకూడదు. జగన్ ఎవరినీ కలవరు. ఎవరితో మాట్లాడేందుకు ఇష్టపడరు. అవసరమైతే తప్ప జగన్ ఎవరినైనా పిలిచి మాట్లాడరు. దీంతో జగన్ కు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు ఎప్పుటికీ తెలియవు. అధికారులు చెప్పేవన్నీ నిజాలు కావు.
ఉన్నది ఉన్నట్లుగా....
అందుకే సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఉన్నది ఉన్నట్లు చెబుతారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఆయన అసహనం వెళ్లగక్కుతున్నారని కొందరు వైసీపీ నేతలు అనుకోవచ్చు. కానీ ధర్మాన ప్రసాదరావు చెప్పేవన్నీ నిజాలే. ఆయన పదవి కోసం చెప్పారనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఎదురవుతున్న కష్టాలను ధర్మాన కుండబద్దలు కొట్టేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే నష్టం తప్పదన్న పరోక్ష వార్నింగ్ ఇచ్చేశారు.
పనులు నిలిచిపోవడానికి...
రాష్ట్రంలో అనేక పనులు నిలిచిపోయాయి. జగన్ నిర్ణయాలు ఏవీ అమలు కావడం లేదు. రోడ్ల దగ్గర నుంచి భవనాల వరకూ పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో పార్టీ నేతలే తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేేసేందుకు ముందుకు వచ్చారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో వారు పనులు చేసి నష్టపోతున్నారు. ఇదే విషయాన్ని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
కార్యకర్తలు నష్టపోతూ....
పార్టీ కార్యకర్తలు నష్టపోతున్న విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కుదరలేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రికి చెప్పారు. కానీ ఎటువంటి నిర్ణయం వెలువడ లేదు. దీంతో ధర్మాన ప్రసాదరావు నేరుగా చెప్పారు. సిమెంట్, ఇసుక, స్టీల్ బయట మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం పాత రేట్లనే కొనసాగిస్తుంది. అందుకే ఉపాధి హామీ పనులు కూడా నిలిచిపోయాయని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. జగన్ వింటే వైసీపీ మంచికే. లేకుంటే ఎవరూ ఏం చేయలేరన్న రీతిలో ధర్మాన ప్రసాదరావు చెప్పడం విశేషం.
Next Story