Fri Nov 08 2024 03:53:00 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్లకు షాక్ ఇవ్వనున్న జగన్
వైసీపీ మరోమారు అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. అందుకు అవసరమైన దిశగా అడుగులు వేస్తుంది.
వైసీపీ మరోమారు అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. అందుకు అవసరమైన దిశగా అడుగులు వేస్తుంది. జగన్ ఈసారి కొంత కఠినంగానే వ్యవహరించనున్నారు. సీనియర్ నేతలను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని దాదాపు డిసైడ్ అయిపోయారు. అవసరమైతే సీనియర్లకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు జగన్ సిద్ధమయిపోయారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.
అన్ని చోట్లా అడ్డం...
మంత్రి వర్గ విస్తరణలోనూ సీనియర్లు జగన్ కాళ్లకు అడ్డం పడుతున్నారు. అంతేకాకుండా వారితో మింగిల్ కావడం కూడా జగన్ కు కష్టంగానే ఉంది. వారితో కెమిస్ట్రీ కుదరడం లేదు. అందుకే ఈసారి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేసి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల వారిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించవచ్చు. కొత్త రక్తాన్ని పార్టీలోకి తీసుకోవచ్చు. అందుకే సీనియర్ నేతలకు ప్లీనరీ తర్వాత జగన్ ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
వీరందరూ లైన్ లో...
సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, బూడి ముత్యాలనాయుడు, పినిపే విశ్వరూప్, రంగనాధరాజు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కరణం బలరాం, ఆనం రామనారాయణరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి వంటి వారిని పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయంటున్నారు. వారి వారసులకు టిక్కెట్ ఇవ్వడమో లేదా వారికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పెద్దల సభలో కూర్చోపెట్టడం వంటివి జరుగుతాయంటున్నారు.
మరికొందరికి...
ఇక కొందరికి అయితే టిక్కెట్లు పూర్తిగా ఇవ్వకుండా పక్కన పెట్టే అవకాశముంది. ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి టిక్కెట్ ఈసారి అనుమానమే. ఆయన స్థానంలో నేదురుమిల్లి రామ్ కుమార్ కు ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా వరకూ టిక్కెట్లు ఇవ్వకుండా వారికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది జగన్ యోచన. రెండేళ్ల ముందు వారికి క్లారిటీ ఇస్తే వారి వారసులను ప్రజలకు పరిచయం చేసుకుంటారని జగన్ భావిస్తున్నారు. ప్లీనరీ తర్వాత సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లపై స్పష్టత ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Next Story