Mon Dec 23 2024 17:25:55 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి బిగ్ రిలీఫ్...ఎలాగంటే?
మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి పాలయింది. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచింది
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు కాగా, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి పాలయింది. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచింది. నవ్వాలో? ఏడవాలో తెలియని స్థితి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లలో తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని సంబరపడాలా? గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని దిగాలు పడాలా? అన్నది తేల్చుకోలేని స్థితిలో వైసీపీ నేతలున్నారు.
లాజిక్ విన్నారా?
అయితే ఇక్కడ కొందరు వైసీపీ నేతల వాదనలో కూడా లాజిక్ ఉందనిపిస్తుంది. ఎలాగంటే ఒక్కో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు లేదా రెండున్నర లక్షల వరకూ మాత్రమే ఓట్లు ఉంటాయి. మొత్తం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు 63 శాసనసభ నియోజకవర్గాల్లో జరిగాయి. తొమ్మిది జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అంటే నియోజకవర్గానికి 35 వేల ఓట్లు మాత్రమే ఈ ఎన్నికలలో పోలయ్యాయి. అందులో కూడా సగం మంది మాత్రమే టీడీపీకి మద్దతు తెలిపారు. మిగిలిన సగంలో ఎక్కువ భాగం ఓట్లు వైసీపీ అభ్యర్థులకు కూడా పడ్డాయంటూ లెక్కలు వేసుకుని సంతృప్తి పడుతున్నారు వైసీపీ నేతలు.
పేదలందరూ...
ఇక్కడ మరోవిషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే నియోజకవర్గాల్లో 2017 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. కానీ 2019 సాధారణ ఎన్నికల్లో ఏం జరిగిందన్న ప్రశ్న కూడా వారి నుంచి వినిపిస్తుంది. ఈ ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు సంబంధం లేదని, అప్పుడు జనం మూడ్ తో పాటు సంక్షేమ పథకాలు కూడా జనంలో బాగా పనిచేస్తాయని, పేద తరగతి ప్రజలు ఓటేస్తారని, వారంతా తమ ఓటు బ్యాంకు అని వైసీపీ నేతలు రిలీఫ్ ఫీలవుతున్నారు. కానీ ఈ వాదనల్లో కొంత నిజమున్నప్పటికీ పూర్తి స్థాయి ఈ వాదనను సమర్థించలేం. తమను తాము సర్దిపుచ్చుకోవడానికి సరిపోతుంది తప్పించి గట్టిగా బల్లగుద్ది చెప్పలేని పరిస్థితి.
ఈ ఎన్నికలు ఒక్క ఛాన్స్ ఇచ్చాయా?
మరో వైపు ఈ ఎన్నికలు గుర్తు మీద జరగలేదంటున్నారు. 2017లో గెలిచిన టీడీపీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలు కాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. గెలుపోటములు సర్వసాధారణమేనని తమకు తాము నచ్చ చెప్పుకుంటున్నారు. అలాగే వైసీీపీకి ఇది ఒకరకంగా ఈ ఎన్నికల ఫలితాలు మంచిదేనని మాత్రం చెప్పాలి. కుర్చీలను నేతలు వీడతారు. జనం బాట పడతారు. క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి తెలిసొచ్చింది కాబట్టి వచ్చే ఎన్నికలకు అప్రమత్తమవుతారు. ఇది జగన్ కు ఒక్కడికే సమస్య కాదు. ఎమ్మెల్యేలు కూడా తాము మరోసారి గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టాలనుకుంటారు. జగన్ కూడా ఇక నేలవైపు చూడాల్సి ఉంటుంది. మైకును మూడు సార్లు టచ్ చేసి.. బటన్ నొక్కితేనే సరిపోదు. అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు బనాయించి సంతోషపడి లాభంలేదు. వారికి వచ్చే సానుభూతిని కూడా అంచనా వేసుకుంటారు. అలా చేసుకోవడానికి మాత్రం జగన్ కు ఈ ఎన్నికలు ఒక్క ఛాన్స్ ఇచ్చాయనే చెప్పకతప్పదు.
Next Story