Tue Dec 24 2024 00:15:06 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పం...లో వైసీపీ గేమ్ ప్లాన్ ఇదే
కుప్పం లో 2024 లో గెలిచేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. చంద్రబాబును కుప్పం కే పరిమితం చేసేందుకు పావులు కదుపుతుంది.
కుప్పం లో 2024 లో గెలిచేందుకు వైసీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. చంద్రబాబును కుప్పం నియోజకవర్గానికే పరిమితం చేసేందుకు పావులు కదుపుతుంది. ఒకవైపు మైండ్ గేమ్ తో పాటు మరోవైపు గ్రౌండ్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంది. తమిళ స్టార్ హీరో విశాల్ కుప్పంలో పోటీ చేస్తారని ప్రచారం చేసింది. అయితే విశాల్ మాత్రం తాను కుప్పంలో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. అసలు విషయం ఏంటంటే కుప్పంలో చివరి నిమిషంలో అభ్యర్థిని రంగంలోకి దించాలన్న యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు.
భరత్ పోటీ చేస్తారంటూ...
కానీ ఇటీవల వైసీపీ ప్లీనరీలో వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఆయన పేరును మార్చే అవకాశముంది. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం పట్టు సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి విజయం తెచ్చిపెట్టింది. చంద్రమౌళి కుమారుడైన భరత్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే భరత్ పై కుప్పం వైసీపీలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
బలమైన అభ్యర్థిని...
చంద్రబాబును కొంత కట్టడి చేయాలంటే కుప్పంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలన్నది వైసీపీ యోచన. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు కుమారుడు సుధీర్ రెడ్డి ఎప్పటి నుంచో కుప్పం పై కన్నేశారు. అక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చివరి నిమిషంలో సుధీర్ రెడ్డి కుప్పం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
బాబును అడ్డుకోవాలంటే...
చంద్రబాబును అన్ని రకాలుగా అడ్డుకోవాలంటే సుధీర్ రెడ్డి వల్ల మాత్రమే అవుతుందని ఇప్పటికే నియోజకవర్గం నుంచి నేతలు పార్టీ హైకమాండ్ కు నివేదికలు పంపారని తెలిసింది. భరత్ పేరును పెద్దిరెడ్డి ప్రకటించినా, ఆయన ఎమ్మెల్సీగా ఉండటంతో సుధీర్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. సుధీర్ రెడ్డిని పోటీకి దింపితే చంద్రబాబు కూడా కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయిస్తారన్న అంచనాలు వైసీపీ నుంచి వినపడుతున్నాయి.
Next Story