వాడకం మామూలుగా ఉండదు!
ఈ ఏడాది ప్రధమార్థంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇకపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చుట్టూ తిరగబోతున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ వినిపించనంతగా ఆయన పేరు ఇప్పుడు వినిపించనుంది. తెలంగాణలో బోణీ కొట్టలేకపోయిన వైఎస్సార్ కుమార్తె షర్మిళ కాంగ్రెస్‌లో చేరుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ప్రధమార్థంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇకపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చుట్టూ తిరగబోతున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ వినిపించనంతగా ఆయన పేరు ఇప్పుడు వినిపించనుంది. తెలంగాణలో బోణీ కొట్టలేకపోయిన వైఎస్సార్ కుమార్తె షర్మిళ కాంగ్రెస్‌లో చేరుతున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా రాజన్న బిడ్డని ఆదరించమంటూ ఆమె తన పార్టీని ప్రారంభించారు. రాజశేఖరరెడ్డి మీద తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అభిమానం ఉన్నా, అది ఓట్లు వేసే స్థాయిలో లేదు. ఆ విషయం ఆమెకు తర్వాత అర్థమైంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఆమె సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజనతో ఏపీవాసుల గుండెకు గాయం చేసిన కాంగ్రెస్‌లో ఆమె చేరడం ఎలాంటి వ్యూహమో ఆమెకే తెలియాలి. ఇకపై రాజశేఖరుడి పేరుకు షర్మిళ కూడా పేటెంట్దారుగా మారుతారు. తొలుత జగన్ తన తండ్రి పేరును విరివిగా వాడేవారు. ఇప్పటికీ సాక్షి మాస్టర్ హెడ్ పక్కన పెద్దాయన ఫోటో, ఆయన చెప్పిన ఓ మాట కనిపిస్తాయి.
ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పాదయాత్ర చేసి, తన స్థాయిని పెంచుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తనదైన శైలిలో కొత్త పథకాలు తీసుకువచ్చారు. తన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వైకాపా అంతా జగన్నామస్మరణతో మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి రక్తం పంచుకు పుట్టిన షర్మిళ కూడా రాజన్న రాజ్యం తెస్తానంటూ, ఆయన పేరును ఉపయోగించుకుంటారు. ఇంతకాలం తమ మనిషి కాదన్నట్లు ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్సార్‌ను ఓన్ చేసుకుంటుంది. రాజశేఖరుని ఫోటోకు దండ వేసి మరీ రాహుల్, సోనియా గాంధీలు ప్రచార సభలు ప్రారంభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
పోయిన వాళ్లను వాడుకోవడంలో చంద్రబాబుది పేటెంట్ హక్కు. ఇప్పటికీ ఎన్టీయార్ ఫోటోకు దండవేసి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ప్రచార సభల్లో జగన్‌ను తిట్టడానికి.. వైస్సార్‌ను పొగుడుతారు. పవన్, భాజపాలు కూడా పనిలో పనిగా దివంగత నేతను గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన మంచిన, జగన్ ‘దుర్మార్గ’ పాలనతో పోల్చి చూపిస్తారు. వైకాపా కూడా సభల్లో జగన్‌తో పాటు, వైఎస్సార్ పేరును జపించనుంది. షర్మిళ పుణ్యమా అని మరణించిన పదిహేనేళ్ల తర్వాత మళ్లీ లైవ్‌లోకి వైఎస్సార్ వస్తున్నారు. మరి అంతిమ లబ్ధి ఎవరికో చూడాలి.