Wed Jan 08 2025 15:48:44 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత
ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మంగళవారం తెల్లవారుజామునుంచి..
ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(46) కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన గత నెల 25న హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎమ్మెల్సీ చల్లా ఆకస్మిక మరణం ఆ పార్టీకి తీరని లోటని పార్టీ నేతలు అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. రేపు తెల్లవారుజామున భగీరథ రెడ్డి పార్థివదేహాన్ని అవుకు తరలించనున్నారు. రేపు సాయంత్రం అవుకులోని చల్లా ఫామ్‌హౌస్‌లో చల్లా భగీరథ రెడ్డి భౌతికకాయానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చల్లా భగీరథ రెడ్డి 1976 ఆగస్టు 30న జన్మించారు. దివంగత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి సంతానమే చల్లా భగీరథ రెడ్డి. ఓయూ లో MA పొలిటికల్ సైన్స్ చేశారు.రామకృష్ణా రెడ్డి వారసుడిగా భగీరథ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2020 డిసెంబర్ 31న తండ్రి రామకృష్ణారెడ్డి కరోనాతో మరణించారు. ఆ తర్వాత భగీరథరెడ్డికి 2021 మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు సీఎం జగన్. చల్లా భగీరథ రెడ్డికి భార్య చల్లా శ్రీలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య అవుకు జడ్పీటీసీగా పనిచేస్తున్నారు.
Next Story