Mon Dec 23 2024 09:14:56 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తుకు దారి దొరికిందా?
రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే అది ఎప్పుడు అనేదే ఇంకా నిర్ణయం కావాలి.
రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే అది ఎప్పుడు అనేదే ఇంకా నిర్ణయం కావాలి. పండగ అయిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఆయన రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన చివరి రోజు రఘురామ కృష్ణరాజు రాజీనామా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన బీజేపీలో చేరడం కూడా దాదాపు ఖాయమయింది. ఆయన ఆ పార్టీ నుంచే ఉప ఎన్నికల్లోకి బరిలోకి దిగనున్నారు.
బీజేపీ, జనసేన మిత్రపక్షంగా...
అమరావతి రాజధాని అంశంపై రఘురామ కృష్ణరాజు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నిక సమయానికి ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. బీజేపీ, జనసేన ప్రస్తుతం మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగానే రఘురామ కృష్ణరాజు నరసాపురం పార్లమెంటు ఉప ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
పోటీకి దూరంగా....
అయితే రఘురామ కృష్ణరాజు రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేస్తే టీడీపీ ఏం చేస్తున్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. అప్పటికయితే పొత్తులు ఖరారు కావు. అందుకే టీడీపీ ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలసి పోటీ చేశాయి. టీడీపీ ఒంటరిగానే పోటీ చేసింది. అక్కడ వైసీపీకే విజయం దక్కింది. బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది.
ఇక్కడి నుంచే...
కానీ రఘురామ కృష్ణరాజు ఉప ఎన్నికల బరిలో ఉంటే టీడీపీ ఆ ఎన్నికకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. అమరావతి రాజధాని అంశంపై రాజీనామా చేస్తారు కాబట్టి తాము మద్దతిస్తామని టీడీపీ బహిరంగంగా ప్రకటించే అవకాశముంది. అందుకే రఘురామ కృష్ణరాజు అమరావతి రాజధాని కోసం రాజీనామా చేస్తానని చెప్పారు. ఈ అంశాన్ని టీడీపీ అవకాశంగా తీసుకుని బీజేపీ, జనసేన అభ్యర్థి అయిన రఘురామ కృష్ణరాజు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుంది. తద్వారా వైసీపీని ఓడించి వచ్చే ఎన్నికలకు నరసాపురం ఉప ఎన్నిక నుంచి పొత్తులకు రహదారిని ఏర్పాటు చేసుకోనుంది.
Next Story