అసెంబ్లీపై కేసీఆర్ ద్విముఖ వ్యూహం!
ఒకవైపు విపక్షాలు అడిగినంత కాలం అసెంబ్లీ నిర్వహించడానికీ, వారు లేవనెత్తే అన్ని డిమాండ్ల మీద చర్చలు నడిపించడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు. అదే సమయంలో రెండో వైపున కాస్త దూకుడుగా వ్యవహరించే ఏ విపక్ష సభ్యుడిని కూడా ఉపేక్షించకుండా.. కఠినంగా వ్యవహరించడానికి కేసీఆర్ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ అంటూ మొదలై.. పాలక పక్షం మీద ప్రెస్ మీట్ లలో కాకుండా ముఖాముఖీ విమర్శలు గుప్పించే అవకాశం వస్తే ఓ ఆటాడుకోవచ్చునని భావించిన విపక్షాలకు సర్కారు చేస్తున్న తాజా ఆలోచన ఓ హెచ్చరికే! అసెంబ్లీలో ఆందోళనల పేరుతో వెల్ లోకి దూసుకువచ్చే సభ్యులపై అప్పటికప్పుడు సస్పెన్షన్ విధించాలని దీనిని ఒక నియమంగా పాటించాలని కేసీఆర్ సర్కారు ప్లాన్ చేస్తుండడం విపక్షాలకు మింగుడుపడకపోవచ్చు.
అసెంబ్లీ సమావేశాలు అంటేనే.. సభలో ఆందోళన చేయడం.. ప్లకార్డులు ప్రదర్శించడం స్పీకరు పోడియం వద్దకు దూసుకెళ్లడం.. వెల్ లో కూర్చుని నినాదాలు చేయడం ఇదంతా తమ హక్కు అని విపక్షాలు భావిస్తూ ఉంటాయి. సభాకార్యక్రమాలు ముందుకు సాగకుండా వీరు పదేపదే అడ్డుపడుతూ ఉంటారు. తాము చేస్తున్న డిమాండ్ కు అనుగుణంగానే సభ సాగాలంటూ పట్టపడుతూ ఉంటారు.
ప్రస్తుతం పార్లమెంటులో జరుగుతున్నది కూడా అదే. పార్లమెంటు మొదలై 20 రోజులు దాటిపోతున్నప్పటికీ.. కనీసం ఒక్కరోజైనా అర్థవంతమైన చర్చ జరగలేదంటే.. అతిశయోక్తి కాదు. ప్రతిరోజూ విపక్ష సభ్యులు ఒకే తీరుగా గొడవ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఆకతాయి చేష్టలకు అవకాశం లేకుండా.. తెలంగాణ సర్కారు కత్తెర వేయాలని అనుకుంటోంది.
తాజాగా సర్కారు ఆలోచిస్తున్న ప్రకారం.. ఎవరైనా సభ్యులు ఆందోళన పేరిట మొదటిసారి వెల్ లోకి వస్తే.. ఒక రోజు సస్పెన్షన్.. రెండో రోజు కూడా అలాగే వస్తే.. వారం రోజుల సస్పెన్షన్.. మూడోరోజు కూడా అలా వస్తే.. ఏకంగా ఆ సెషన్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధించేలా నియమం పెట్టాలని అనుకుంటున్నారు. ఈ మేరకు గురువారం జరిగే బీఏసీ సమావేశంలోనే అన్ని పార్టీల సమక్షంలో ప్రస్తావించి హెచ్చరించాలని కూడా నిర్ణయించారు.
ఇదే ఆచరణలోకి వస్తే గనుక.. కేసీఆర్ సర్కారు విపక్షాలు అడిగినట్లుగా వెంటనే అసెంబ్లీ ని సమావేశపరుస్తూ, వారు మళ్లీ గొడవ చేయకుండా.. నెలాఖరు వరకు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాలు తమ ఆందోళనలు చేయడానికి హద్దులేర్పడతాయి. ఆ హద్దులు మీరితే.. అసలు సభలో కూర్చునే పరిస్థితే లేకుండా పోతుంది. అందుకే కేసీఆర్.. హడావుడి చేయకుండా అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం అందరి ఆట కట్టిస్తుందని అనుకుంటున్నారు.
- Tags
- కేసీఆర్