కర్నూలు జిల్లా లో 16 సార్లు ఉప ఎన్నికలు
కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 16 సార్లు ఉప ఎన్నికలు శాసనసభకు జరిగాయి. మొదటి ఉప ఎన్నిక 1957లో పత్తికొండ నియోజక వర్గంలో జరిగింది. ఆ తర్వాత అత్యధిక సార్లు నంద్యాల పక్కనే ఉన్న ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగాయి. ఆళ్లగడ్డలో న మొత్తం అయిదు ఉప ఎన్నికలు జరిగాయి. నంద్యాలకు రెండోసారి ఉప ఎన్నిక జరిగింది. 1955లో ఎమ్మెల్యేగా ఎన్నికైన జి.రామిరెడ్డి మరణంతో ఆయన సమీప బంధువు జి.వి.రెడ్డి 1959లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.
పత్తికొండలో .....
1957లో అప్పటి ఎమ్మెల్యే హనుమంతరెడ్డి మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఎల్.ఎన్.రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత అదే నియోజకవర్గంలో 1985లో తెదేపా అభ్యర్థిగా కె.మహబలేశ్వరగుప్తా గెలిచినా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురయ్యారు. దీంతో 1986లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి కె.సుబ్బరత్నమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆళ్లగడ్డలో ఐదు సార్లు.....
ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తొలి ఉప ఎన్నిక 1980లో అప్పటి ఎమ్మెల్యే గంగుల తిమ్మారెడ్డి మరణంతో జరిగింది. ఆ స్థానాన్ని ఆయన కుమారుడు గుంగుల ప్రతాప్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై భర్తీ చేశారు. 1989లో తెదేపా తరఫున ఎన్నికైన భూమా శేఖర్‌రెడ్డి (ప్రస్తుత నంద్యాల అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తండ్రి) మరణంతో ఆయన సోదరుడు భూమా నాగిరెడ్డి తెదేపా అభ్యర్థిగా 1992లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. 1997లో కూడా ఆళ్లగడ్డ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది. 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందిన భూమా నాగిరెడ్డి నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందడంతో అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన భార్య భూమా శోభానాగిరెడ్డి తెదేపా అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.2012లో జరిగిన ఉప ఎన్నికలో శోభా గెలిచారు. అంతకు ముందు 2009లో ప్రజారాజ్యం తరఫున గెలుపొందిన శోభానాగిరెడ్డి ఆ పార్టీ 2012లో కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో శోభానాగిరెడ్డి వైకాపా అభ్యర్థిగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న శోభానాగిరెడ్డి రహదారి ప్రమాదంలో మరణించారు. దీంతో తిరిగి జరిగిన ఉప ఎన్నికల్లో శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఇలా అయిదు సార్లు ఆళ్లగడ్డలో ఉప ఎన్నికలు జరిగాయి.
కోట్ల కోసం రాంభూపాల్ రాజీనామా.....
1993లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి శాసనసభకు ఎన్నికయ్యేందుకు వీలుగా 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటసాని రాంభూపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఫలితంగా పాణ్యంలో 1993లో జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి విజయం సాధించారు. తెదేపా అభ్యర్థిగా అప్పట్లో రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరిపై కోట్ల గెలుపొందారు.
బనగానిపల్లిలో....
బనగానపల్లె నియోజకవర్గంలో విలీనమైన కోవెలకుంట్ల నియోజకవర్గంలో 1975లో ఉప ఎన్నిక జరిగింది. 1972లో కోవెలకుంట్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బి.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగా ఆయన మరణించారు. దీంతో 1975లో జరిగిన ఉప ఎన్నికలో ఎం.వి.సుబ్బారెడ్డి గెలుపొందారు.
డోన్‌లో రెండు సార్లు...
డోన్ నియోజక వర్గంలో రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. 1962లో డోన్ నుంచి నీలం సంజీవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. నీలం సంజీవరెడ్డి ఒక కోర్టు తీర్పు నేపథ్యంలో రాజీనామా చేయడంతో 1965లో ఉప ఎన్నిక జరిగింది. దీంతో అక్కడ నీలం సంజీవరెడ్డి అల్లుడు చల్లా రాంభూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి 1994లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి డోన్ నుంచి గెలుపొంది ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత విజయభాస్కర్‌రెడ్డి కేంద్ర మంత్రి పదవి లభించడంతో ఆయన శాసనసభకు రాజీనామా చేశారు. 1996లో జరిగిన ఉప ఎన్నికలో కె ఈ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
ఎమ్మిగనూరులో రెండు సార్లు....
ఎమ్మిగనూరులో రెండు సార్లు ఉప ఎన్నిక జరిగింది. 1983లో ఎమ్మిగనూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి హోదాలో విజయభాస్కర్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. కానీ, అప్పుడు రాష్ట్రంలో తెదేపా విజయం సాధించడంతో విజయభాస్కర్‌రెడ్డి రాజీనామా చేశారు. దీంతో 1983లోనే జరిగిన ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి బీవీ మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2012లో ఉప ఎన్నిక జరిగింది. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నకేశవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైకాపా తరఫున ఆ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆలూరులో .....
1987లో ఆలూరు లో ఉప ఎన్నిక జరిగింది. 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మసాల ఈరన్న జడ్పీ ఛైర్మన్‌గా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1987లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆలూరు నుంచి మొలగవల్లి రంగయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు.