కేసీఆర్ కు బలమైన మహూర్తం కుదరలేదట
తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు శంకుస్థాపనకే నోచుకోవడం లేదు. వరంగల్ జిల్లా వాసులను ఊరిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తాలు....నిర్ణయించడం...అవి వాయిదా పడటం సాధారణంగా మారిపోయాయి. వరంగల్ జిల్లాలో టెక్స్ టైల్ పార్కు నిర్మిస్తామని తెలంగాణ సర్కార్ వాగ్దానం చేసింది. వరంగల్ లో దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ పార్కును నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు, విపక్షాలు సయితం స్వాగతించాయి. అయితే ఏడాది నుంచి ఈ పార్కు శంకుస్థాపనకు మాత్రం ముహూర్తం కుదరడం లేదు. బలమైన ముహూర్తం కుదరకపోవడం వల్లనే శంకుస్థాపన చేయడం లేదని టీఆర్ఎస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమయం దొరకనా? లేక మరేదైనా సమస్యా? అన్నది అర్ధం కావడం లేదని వరంగల్ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా వాపోతున్నారు.
టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపన ఎప్పుడు?
వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూసేకరణను కూడా చేసింది. 1200 ఎకరాల్లో ఈ పార్క్ ను నిర్మించనున్నారు. పర్యావరణ అనుమతులను కూడా కోరారు. 1150 కోట్ల రూపాయలతో డీపీఆర్ కు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఈ టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి కూడా అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. దక్షిణ కొరియాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన పది కంపెనీలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. ఇంత జరిగినా టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపన మాత్రం ఇంత వరకూ జరగలేదు. ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేయడం వాయిదా పడటం జరిగిపోయింది. తొలిదశలో 450 కోట్ల రూపాయల పెట్టుబడితో పది కంపెనీలతో ఈ పార్క్ ను ప్రారంభిస్తామని అధికార పార్టీ నేతలు గొప్పగా చెప్పినా ఆచరణలో మాత్రం జరగడం లేదు. సీఎం కేసీఆర్ ఈ ఏడాది కాలంలోనే వరంగల్ జిల్లాకు రెండు సార్లు వచ్చినా పార్క్ కు మాత్రం శంకుస్థాపన జరగలేదు. ప్రధాని మోడీ చేత ఈ పార్క్ శంకుస్థాపన చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారని, ప్రధాని సమయం ఇవ్వనందుకే ముహూర్తం ఖరారు కాలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ టెక్స్ టైల్ పార్క్ కు ఇంకా శంకుస్థాపనే చేయకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.