గోస్పాడు....నంద్యాలలో ఎవరిని గెలిపిస్తుంది?
నంద్యాలలో గోస్పాడు మండలమే కీలకం కానుంది. గోస్పాడు మండలంలో మొత్తం 28,844 మంది ఓటర్లున్నారు. ఈ మండలంలో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఇక్కడ దాదాపు 80 శాతానికి పైగా పోలింగ్ జరిగే అవకాశముంది. గోస్పాడు మండలంలో తొలి నుంచి వైసీపీకి పట్టుంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిని గెలిపించింది ఖచ్చితంగా గోస్పాడు మండలమే. అయితే మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా గోస్పాడు మండలం ఇప్పుడు ఎటువైపు ఉంటుందన్నదే ఆసక్తిగా మారింది. రెండు ప్రధాన పార్టీలూ ఈ మండలంపైనే దృష్టిపెట్టాయి. నంద్యాలో పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఈ మండలంలో ఏర్పాటు చేసిన39 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఈవీఎంలు సజావుగా ఇక్కడ నడుస్తుండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.
గంగుల కు పట్టున్న....
దీనికి తోడు గోస్పాడు మండలంలోని గోస్పాడు, దీబగుంట్ల, యాళ్లూరు, కృష్ణాపురం గ్రామాలు అత్యంత సమస్యాత్మకమైనవి. ఈ గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గోస్పాడు మండలం గతంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కలిసి ఉండేది. పునర్విభజన ప్రక్రియలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో కలిసింది. ఇటీవల టీడీపీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డికి గోస్పాడు మండలంలో పట్టుందంటున్నారు. గంగుల రాకతో గోస్పాడు మండలంలో తమ బలం పెరిగిందని చెబుతున్నారు టీడీపీ నేతలు. మొత్తం మీద నంద్యాల నియోజకవర్గంలో గోస్పాడు మీదనే అందరి దృష్టి ఉంది.
- Tags
- గోస్పాడు