చంద్రబాబుపై కేసు వేయనున్న శేఖర్ రెడ్డి
టీటీడీ పాలక మండలి నుంచి తొలగింపబడిన సభ్యుడు శేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కేసు వేయడానికి సిద్ధమవుతున్నారా? ఆయనకు సన్నిహితంగా ఉండే వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని బట్టి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం అలాంటి చర్చే నడుస్తోంది. శేఖర్ రెడ్డి వద్ద భారీగా నగదు, బంగారం, ఆస్తులకు సంబంధించిన డాక్యమెంట్లు దొరికిన సంగతి తెలిసిందే. దాన్ని బట్టి చంద్రబాబునాయుడుకు శేఖర్ రెడ్డి సన్నిహితుడంటూ ఒక ప్రచారం కూడా మొదలైంది. ఆగ్రహించిన చంద్రబాబు ఆయనను టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించారు. జీవో కూడా వచ్చేసింది.
అయితే చంద్రబాబు మౌఖిక ఆదేశాలకు, జీవో రావడానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. శేఖర్ రెడ్డిని తొలగించడానికి న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవడానికే జాప్యం జరిగిందని అంతా అనుకున్నారు. మొత్తానికి ఆయన అవినీతికి పాల్పడినట్లుగా తేలడంతో పదవినుంచి తొలగిస్తున్నట్లు జీవో వచ్చింది.
దానిని బట్టి ఇప్పుడు శేఖర్ రెడ్డి ఏపీ ప్రభుత్వం మీద కేసు వేయడానికి సిద్ధమవుతున్నట్లుగా ఒక వదంతి వినిపిస్తోంది. తన ఇంట్లో ఐటీ సోదాల్లో నగదు దొరికిన విషయం నిజమే గానీ.. తనను నేరస్థుడిగా ఇంకా ప్రకటించలేదని.. తన నేరం నిరూపణ కాకుండానే.. అవినీతి నింద వేసి పదవినుంచి తొలగించడం సబబు కాదని వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ కారణం మీదనే కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారట. శేఖర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఐటీ శాఖ నుంచి ఈడీకి మారింది. ఈడీ వారు కేసు నమోదు చేసి, తన నేరం గురించి తేల్చకుండా చర్య తీసుకోవడం ఏంటనేది శేఖర్ రెడ్డి వాదన అంటున్నారు. ఈడీ తన నేరాన్ని తేల్చేదాకా పదవిలో ఉండేలా , తొలగింపు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అడగబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఈడీ కేసు నమోదు అయి.. ఆ కేసు తేలేలోగా.. శేఖర్ రెడ్డి పదవీకాలం కూడా పూర్తయిపోతుందనే అంచనాలు నడుస్తున్నాయి.