చిరు రాజకీయాల్లోనే ఉన్నారోచ్....
చిరంజీవి ఇంకా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆ మధ్య కేంద్ర మంత్రి పదవి కాలం ముగిసిన తర్వాత క్రియా శీల రాజకీయాలకు దూరం అయిపోయినట్లే కనిపించారు. ఈ ఏడాది ఓ సినిమాలో కూడా నటించారు. మరో చిత్రంలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిరు రాజ్య సభ సభ్యత్వం ముగుస్తున్న తరుణంలో ఆయనకు మళ్ళీ తిరుపతి ప్రజల కష్టాలు గుర్తుకు వచ్చాయి. గత మూడేళ్ల నుంచి మౌనంగా ఉన్న చిరంజీవి మళ్లీ సమస్యలపై స్పందించారు. ప్రజల పక్షాన తాను ఉన్నానని చాటి చెప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీపై చిరంజీవి విరుచుకుపడ్డారు. తిరుపతిలో నెలకొన్న సమస్యలపై చిరంజీవి స్పందించడం చూస్తుంటే మళ్లీ ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలిసిపోతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు, చివరకు నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి కూడా చిరంజీవి దూరంగా ఉన్నారు. సినిమాలపైనే దృష్టి పెట్టిన చిరంజీవి ఉన్నట్లుండి ప్రజాసమస్యలపై స్పందించడం వెనక కారణాలేంటన్న చర్చ ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది.
ప్రభుత్వంపై విమర్శలు....
ప్రజా రాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి చిరంజీవి గెలుపు వరకు తిరుపతి తో చిరంజీవికి విడదీయరాని సంబంధం ఉంది. ఆ అభిమానం తోనే తిరుపతిలో పారిశుధ్య కార్మికుల సమస్యపై చిరు ప్రకటన విడుదల చేశారు. తిరుపతి నగరంలోని 18వ వార్డులో ఉన్న స్కావెంజర్స్ కాలనీ ఖాళీ చేయించడానికి ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని చిరంజీవి విమర్శించారు. తాను ఎమ్మేల్యేగా ఉన్న సమయంలో కాలనీలో కొన్ని అభివృద్ధి పనులు చేసానని., 70 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న దాదాపు 160 కుటుంబాల వారిని అక్కడ నుంచి బలవంతంగా ఖాళీ చేయించి 2ఎకరాల 34 సెంట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి తిరుపతి కార్పొరేషన్ ప్రయత్నాలు చేయడం అమానవీయం అని విమర్శించారు. తిరుపతి నగరం నడిబొడ్డున స్కావెంజర్స్ కాలనీ ఉండటం ఈ ప్రభుత్వం సహించలేకపోతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వివక్ష తో కుడినదేనని ప్రజలందరిని సమానంగా చూడాలనే రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా చేయడం సరి కాదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి కార్పొరేషన్ తమ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.స్కావెంజర్స్ కాలనీని రోల్‌మోడల్ కాలనీగా అభివృద్ధి పర్చాలని., అక్కడి కుటుంబాల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి తగిన భరోసా ఇవ్వాలన్నారు. నిరుపేద కుటుంబాల పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించాలని చిరంజీవి డిమాండ్ చేశారు.
- Tags
- చిరంజీవి