నంద్యాల గెలుపుతో టీడీపీ హ్యాపీగా లేదా?
నంద్యాలలో గెలుపు నిజంగా టీడీపీకి ఆనందాన్నిచ్చిందా? అంటే లేదనే చెప్పాలి. చాలా మంది టీడీపీ నేతల్లో నంద్యాల గెలుపు పెద్ద సంతోషాన్ని మిగిల్చలేదు. మూడున్నరేళ్ల తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో గెలిచామన్న సంతృప్తి తప్ప సంతోషం ఆ పార్టీకి మిగలలేదన్నది వాస్తవం. నంద్యాల ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అది టీడీపీకి అవసరం. గత మూడున్నరేళ్ల పాలనకు నంద్యాల ఉప ఎన్నిక అద్దం పడుతుంది. దాన్ని ఎవరూ కాదనరు. టీడీపీ ఓటమి పాలయితే చంద్రబాబు పాలనపై అసంతృప్తి ఉందన్న ముద్ర పడుతుంది. అందువల్లే చంద్రబాబును నంద్యాలను ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. భూమా నాగిరెడ్డి మరణించిన మరుసటి రోజే వైసీపీ అధినేత జగన్ తాము నంద్యాలలో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఉప ఎన్నిక తప్పదని చంద్రబాబు భావించి నంద్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
అభివృద్ధి గెలుపుకు కారణమని చెప్పలేమా?
భూమా మరణించిన నెల గడవక ముందే సొంతంగా సర్వేలు చేయించుకున్నారు. ఉప ఎన్నిక కావడంతో మొత్తం కేబినెట్ మొత్తాన్ని నంద్యాలలో దించగలిగారు. కావాల్సినంత సమయం ఉండటంతో వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నోటిఫికేషన్ కు ముందే హామీలు గుప్పించారు. అధికారం చేతిలో ఉండటంతో డబ్బు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేశారు. కులాల వారీగా పెద్దలను తమ జట్టులోకి చేర్చుకోగలిగారు. ఇంత చేస్తే తప్ప నంద్యాలలో టీడీపీకి విజయం సాధ్యం కాలేదు. ఇంతమందిని రంగంలోకి దించి...ఇన్ని వ్యూహాలు రచించితే తప్ప ఉప ఎన్నికలో గెలుపు సాధ్యం కాలేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. నంద్యాలలో గెలిచామని పండగ చేసుకోవాల్సినంత సీన్ లేదని కూడా కొందరు ముఖ్యనేతలు చెబుతున్నారు. సానుభూతి కూడా ఎక్కువ పనిచేయడం, వైసీపీ చేసిన తప్పులే ఇంత మెజారిటీని తెప్పించాయి తప్ప పాలన చూసి పెద్దగా ఓటెయ్యలేదని కూడా టీడీపీలో విశ్లేషణలు కొందరు అంతర్గతంగా చేస్తున్నారు. మొత్తం మీద నంద్యాలలో గెలిచామన్న సంతృప్తి తప్ప.....సంతోషం పెద్దగా టీడీపీలో కన్పించడం లేదు.
- Tags
- నంద్యాల టీడీపీ