నంద్యాల పోలింగ్ పై చంద్రబాబు, జగన్ ఆరా
నంద్యాల నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అక్కడి నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం 7గంటల నుంచి చంద్రబాబు ఇప్పటికి అనేకసార్లు ఫోన్లు చేసి నేతలను సున్నితంగా హెచ్చరించారు కూడా. పోలింగ్ విషయంలో నిర్లక్ష్యం చూపవద్దని, ప్రతి ఓటరునూ పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని నేతలను ఆదేశించారు. పోలింగ్ సరళి, ఓటరు నాడిని కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు అడుగుతున్నారు. పోలింగ్ పూర్తయ్యేంత వరకూ నిరంతరం అన్ని పోలింగ్ కేంద్రాలను కనిపెట్టే ఉండాలని కూడా హెచ్చరించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను, వృద్ధులను ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చూడాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు తెలుగుదేశం పార్టీ పట్ల అనుకూలంగా ఉంటారని, వారి ఓట్లు ఎక్కవ పోలయ్యేలా చూడాలని భూమా బ్రహ్మానందరెడ్డికి ఫోన్ చేసి చెప్పారని తెలుస్తోంది.
ఎక్కువ మందిని పోలింగ్ కు తరలిస్తే....
మరోవైపు విపక్ష నేత జగన్ కూడా నంద్యాల ఉప ఎన్నికపై కొంత టెన్షన్ గానే ఉన్నారు. ముస్లిం, కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా చర్యలు తీసుకోవాలని శిల్పా బ్రదర్స్ ను కోరారని చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికను ఎలాగైనా గెలిచి తీరాలన్న కసిలో ఉన్న జగన్ ఎప్పటికప్పుడు ఓటింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైనా అధికారులు ఇబ్బంది పెడితే వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని, ఉపేక్షించవద్దని కూడా హెచ్చరించారు. ముఖ్యంగా గోస్పాడు మండలంలో ఓటరు నాడి ఎలా ఉందో జగన్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
- Tags
- జగన్ చంద్రబాబు