నంద్యాల మాదిరిగానే.... కాకినాడలోనూ చంద్రబాబు
నంద్యాల ఉప ఎన్నికల మాదిరిగానే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా కాకినాడలో పసుపు జెండాను ఎగురవేయాలన్నది లక్ష్యంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరగుగున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికను చంద్రబాబు సవాల్ గా తీసుకున్నారు. అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఎన్నికలో విజయం సాధిస్తేనే వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. అందుకోసమే ఆయన వార్డుల వారీగా కాకినాడలో మంత్రులకు కూడా పనివిభజన చేశారు. మొత్తం 48 వార్డులకు 10 మంది మంత్రులను చంద్రబాబు నియమించారు. ప్రచారం ముగిసేంత వరకూ వారు కాకినాడలోనే ఉంటారు. మిగిలిన మంత్రులు కూడా కాకినాడ పర్యటనకు వస్తున్నారు.
రెండు రోజులు కాకినాడలోనే......
అయితే చంద్రబాబు నంద్యాల మాదిరిగానే కాకినాడలోనూ రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఈ నెల 26, 27వ తేదీల్లో చంద్రబాబు కాకినాడ టూర్ ఖరారయింది. ఈ రెండు రోజుల పాటు కాకినాడలో చంద్రబాబు రోడ్ షో, వివిధ సామాజిక వర్గాల సమావేశాలను నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 3గంటలకు చంద్రబాబు కాకినాడ చేరుకుంటారు. 47,49,50 డివిజన్లలో రోడ్ షోలను నిర్వహిస్తారు. రాత్రికి కాకినాడలోని ఓ ఫంక్షన్ హాలులో చంద్రబాబు బస చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా 9 వార్డుల్లో పోటీ చేస్తోంది. బీజేపీకి చెందిన వార్డుల్లోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. మొత్తం మీద చంద్రబాబు నంద్యాల మాదిరిగానే కాకినాడలోనూ తన వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు.
- Tags
- చంద్రబాబు