నంద్యాలలో ఈ రాత్రే కీలకమా?
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ రేపు ప్రారంభం కానుంది. రెండు పార్టీలూ సమఉజ్జీలుగా ఉన్న ఈ ఉప ఎన్నికను ఎలాగైనా కైవసం చేసుకోవాలని రెండు పార్టీలూ పోటీ పడుతున్నాయి. అందుకు ఈ రాత్రే కీలకమంటున్నాయి. రేపు పోలింగ్ కావడంతో ఈ రాత్రికి ఓటర్లను పెద్దయెత్తున ప్రలోభ పెట్టే అవకాశముంది. ఇప్పటికే మహిళలకు ముక్కుపుడకలు, చెవిదుద్దులు బహుమతులుగా ఇస్తున్నారు. నగదుపాటు అదనంగా ఇది నజరానా అన్నమాట. ఓటర్లను మరింత లోబర్చుకునేందుకు ఈ రాత్రి పార్టీ అభ్యర్థులు పోటీ పడతారని భావించిన రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఈ రాత్రి గడిస్తే చాలనుకుంటున్నాయి.
రాత్రి వేళ గస్తీ దళాలు....
అందుకే రాత్రి వేళ తమ ప్రయివేటు గస్తీ దళాలను నియమించుకున్నాయి. వార్డుల వారీగా గస్తీ దళాలను నియమించకున్నాయి. ఓటర్లకు డబ్బులిస్తున్నట్లు కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారమిచ్చేందుకు వీరు రెడీగా ఉన్నారు. ఈ గస్తీ దళాలు రాత్రంతా జాగారం చేసి ఒక పార్టీపై మరొక పార్టీ కన్నేసి ఉంచింది. నంద్యాల ఉప ఎన్నికలో ఓటరు నాడి ఎటూ తేలకపోవడంతో పార్టీలు ప్రతి ఓటునూ కీలకంగానే భావిస్తున్నాయి. అందుకోసమే ఈ రాత్రే తమకు కీలకమంటున్నాయి రెండు పార్టీలు. మొత్తం మీద రాత్రి గడిచి రేపు పోలింగ్ ప్రారంభమయ్యే వరకూ రెండు పార్టీల్లో టెన్షన్ తప్పేట్లు లేదు. రెండు పార్టీల ప్రయివేటు సైన్యం నంద్యాలను పహారా కాస్తోంది.