నంద్యాలలో నరాలు తెగే టెన్షన్
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. అతి కీలకంగా భావించే ఈ ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు ఓటర్ల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఈ ఎన్నిక కోసం ఎంతో శ్రమించాయి. దాదాపు నెల రోజుల పాటు నంద్యాల ప్రచారంతో హోరెత్తిపోయింది. ఎన్నో హామీలు....ఎన్నో శపథాలు...ఎన్నో సవాళ్లు...ఇలా సాగిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభయింది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం ఆరుగంటల నుంచే పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. ఉదయం 7గంటల నుంచి సాయత్రం ఏడు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మధ్యనే ఉంది. ఎలాంటి సంచలన తీర్పు ఓటరు ఇస్తారోనన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. ఈ నెల 28వ తేదీన నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు.....
నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,19,108 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,07,778 కాగా, మహిళా ఓటర్లు 1,11,018 మంది. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఈ నియోజకవర్గంలో ఎక్కవ. మహిళలే విజేతను నిర్ణయించనున్నారు. అందుకే మహిళలను ఆకట్టుకునేందుకు రెండు ప్రధాన పార్టీలూ పోటీ పడ్డాయి. నంద్యాల టౌన్ లో మొత్తం 42 వార్డులున్నాయి. నంద్యాల రూరల్ మండలంలో 20 గ్రామాలున్నాయి. గోస్పాడు మండలంలో 15 గ్రామాలున్నాయి. పట్టణంతో పాటు పల్లెలూ ఈ ఎన్నికలో కీలకంగా మారనున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక కోసం మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నంద్యాల టౌన్ లోనే 159 పోలింగ్ కేంద్రాలను, నంద్యాల రూరల్ మండలంలో 57 పోలింగ్ కేంద్రాలను, గోస్పాడు మండలంలో 39 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికలకు అంతా సిద్ధమవ్వడంతో ఇక ప్రజాతీర్పు కోసం వేచిచూడాల్సిందే. మొత్తం మీద నరాలు తెగే టెన్షన్ పడుతున్నాయి రెండు పార్టీలు.
- Tags
- నంద్యాల పోలింగ్