నంద్యాలలో చివర్లో తురుపు ముక్కను బయటకు తీసిన టీడీపీ, వైసీపీ
నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశాన్ని చివరి నిమిషంలో రెండు పార్టీల నేతలూ తెరపైకి తెచ్చారు. నిన్న మొన్నటి వరకూ ప్రత్యేక హోదా ఊసెత్తని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో హోదా కార్డును బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ ఏపీ ప్రజల్లో బలంగా ఉంది. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదాకు సుముఖత వ్యక్తం చేయకపోవడం, ప్యాకేజీని ప్రకటించడం జరిగిపోయింది. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని టీడీపీ సమర్థించింది. దీంతో ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పెద్దయెత్తునే ఉద్యమించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ కూడా బీజేపీ పంచన చేరడంతో ప్రత్యేక హోదా నినాదం మరుగున పడిపోయింది.
చివరిరోజున హోదా అంశం ప్రస్తావన.....
ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికలు వచ్చాయి. గత పక్షం రోజుల నుంచి ప్రచారం చేస్తున్న జగన్ కూడా ప్రత్యేక హోదా గురించి నంద్యాలలో ప్రస్తావించలేదు. అయితే శని, ఆదివారాల్లో మాత్రం జగన్ ప్రత్యేక హోదా రానివ్వకుండా టీడీపీ అడ్డుపడిందని ఆరోపించారు. కేంద్రం ఇవ్వకపోయినా ప్యాకేజీతో తృప్తి పడటమేంటని ప్రశ్నించారు. హోదాతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీతో సంబరపడుతున్న టీడీపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని జగన్ పిలుపునిచ్చారు. అలాగే చంద్రబాబు కూడా శని, ఆదివారాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఎందుకు మాటతప్పారని బాబు ఎదురుదాడికి దిగారు. మొత్తం మీద ప్రత్యేక హోదా కార్డును ప్రచారం చివరి క్షణంలో రెండు పార్టీలూ బయటకు తీశాయన్న మాట.
- Tags
- ప్రత్యేక హోదా