నంద్యాలలో సమస్యాత్మక ప్రాంతాలు ఇవే
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ అంతా సిద్ధమైంది. మొత్తం 71 సున్నిత ప్రాంతాలను, 144 అతి సున్నిత ప్రాంతాలను ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. మొత్తం 2,18,00 వేల మంది ఓటర్లున్న నంద్యాల నియోజకవర్గంలో రేపు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవుతోంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరగనుంది. క్యూలైన్లలో ఉంటే ఐదు గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. పోలింగ్ కోసం మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీ రాజకీయాలను మలుపుతిప్పే నంద్యాల ఉప ఎన్నిక కావడంతో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించారు. 144 సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఇప్పటికే కేంద్రబలగాలు సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతును నిర్వహించాయి.
కేంద్రబలగాల కవాతు......
దాదాపు 3,500 మంది కేంద్ర బలగాలను నంద్యాలలో మొహరించారు. ఇప్పటి వరకూ నంద్యాల నియోజకవర్గంలో 1.16 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలను బంద్ చేశారు. స్థానికేతరులు నంద్యాలలో ఉండేందుకు వీలు లేదు. ఈ నెల 23 సాయంత్రం వరకూ ఎలాంటి సర్వేలు చేయకూడదు. సర్వేలపై నిషేధం విధించారు. బల్క్ ఎస్ఎంఎస్ లపై కూడా నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనా కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. పోలింగ్ కేంద్రంలో ఎవరికి ఓటు వేశారో ఓటరుకు తెలిసేలా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మిషన్ పై 7 సెకన్ల పాటు తాము ఎవరికి ఓటేశారో డిస్ ప్లే అవుతుంది. తర్వాత అది కన్పించదు. ఓటు ఎవరికి వేశామో చెప్పినా చర్యలు తప్పవంటున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.