నీకిది తగునా...నారాయణా..?
మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్ధులు 13జిల్లాల్లోని పురపాలక సంఘాల ఆధీనంలోని పాఠశాలల్లో చదువుతున్నారు. అయితే చాలా చోట్ల తగినంత మంది విద్యార్ధులు లేకపోవడంతో పాటు విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉండటం., ఉపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రభుత్వం సంస్కరణలకు నడుం బిగించింది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ముసిసిపల్ స్కూళ్లలో విద్యా బోధన జరగాలనే ఉద్దేశంతో ఈ నెల 2న జీవో నెంబర్ 332 జారీ చేసింది.
జీవోలో ఏం ఉందంటే....
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమల్లోకి వస్తుందని ఆ జీవోలో పేర్కొంది. 2016-17 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి చదువుతున్న వారికి మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తుండగా సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యార్ధి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాల విద్య కోసం సగటున ఒక్కో విద్యార్ధిపై ఏటా 8వేల రుపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై గత కొద్ది కాలంగా సర్కారు కసరత్తు చేస్తోంది. తొలిదశలో మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో కొన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేసిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో తెలుగు మీడియం స్కూళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సర్కారు ఏం చెబుతోందంటే....
విద్యా సంవత్సరం చివర్లో ఈ తరహా నిర్ణయం తీసుకోవడంతో విద్యార్ధులు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నా పెద్ద సమస్య ఉండదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలల్లో బోధన గాలికొదిలేసే ఉపాధ్యాయులకు ఖచ్చితంగా జవాబుదారీతనం వస్తుందని., ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే మంచి వేతనాలు అందుకుంటున్నా అందుకు తగ్గ ఫలితాలు మాత్రం చూపడం లేదని సర్కారు భావిస్తోంది. దీంతో పాటు పేద., మధ్యతరగతి వర్గాలకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాభ్యాసం భారంగా మారుతోంది. పదో తరగతి తర్వాత భాషానైపుణ్యాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు వెనుకబడిపోతున్నారని దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు చెబుతోంది.
మంత్రి పెత్తనమేంటి?
మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ఎస్టీయూ., పిఆర్టియూ వంటి ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఎస్ఎఫ్ఐ., ఏఐఎస్ఎఫ్ వంటి విద్యార్ధి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విద్యా బోధన విషయంలో మునిసిపల్ శాఖ మంత్రి నారయణ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. విద్యాశాఖ తీసుకోవాల్సిన నిర్ణయాలను మునిసిపల్ మంత్రి తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుండటంతో ఈ వ్యవహారంపై శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చించనుంది.
- Tags
- నారాయణ