పళనిస్వామిని దినకరన్ దించేస్తారా?
తమిళనాడు రాజకీయాలు ఏ క్షణంలోనైనా మారే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిసిపోయి శశికళకు బయటకు సాగనంపేందుకు సర్వం సిద్ధం చేశారు. రెండు వర్గాలు కలిసిపోయిన తర్వాతచేసిన ప్రకటనతో దినకరన్ ఇక వ్యూహాలను రచిస్తున్నారు. తొలి నుంచి పన్నీర్ సెల్వం చేస్తున్న డిమాండ్ కు పళని అంగీకరించారు. పార్టీ గుర్తు, జెండాను తాము కైవసం చేసుకుంటే ఇక తిరుగుండదని, శశికళ అండ్ కో ను సాగనంపవచ్చన్నది పళని వ్యూహంగా కన్పిస్తోంది. అయితే రెండు రోజుల క్రితం పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళను కలిసి వచ్చిన దినకరన్ ఇప్పుడు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. తమ కుటుంబాన్ని దారుణంగా మోసం చేసిన పళనిస్వామిపై కసి తీర్చుకోవాలని శశికళ సయితం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దినకరన్ వెంట సుమారు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు మరికొంత మంది స్లీపర్ సెల్స్ లాంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని దినకరన్ బహిరంగంగానే చెబుతున్నారు. రెండు వర్గాలు విలీనం అయ్యేంత వరకూ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాని శశికళ పదవికి ఎసరు పెడితే తడాఖా చూపిస్తామంటున్నారు దినకరన్.
శశికళ పదవిని టచ్ చేస్తే......
అన్నాడీఎంకే కి మొత్తం 135 మంది శాసనసభ్యులున్నారు. 22 మంది తిరుగుబాటు చేస్తే పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. ఆ అంకెకు తగినంత మంది సభ్యులు ఇప్పుడు దినకరన్ వద్దనే ఉన్నారు.22 మంది చేత తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే పళనిస్వామికి కష్టాలు తప్పవు. ఇదే విషయాన్ని బీజేపీనేత సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్పారు. శశికళను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించలేరని, ఒకవేళ తప్పిస్తే శశికళ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా వెనకాడరని స్వామి చెప్పిన జోస్యం నిజమయ్యేలా కన్పిస్తుంది. దినకరన్ స్పష్టంగా శశికళను తప్పించిన వెంటనే గవర్నర్ వద్దకు వెళ్లి తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. 22 మంది పైకి కన్పిస్తున్నా మరో 18 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని దినకరన్ బహిరంగంగానే చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలను డీఎంకే ఆసక్తిగా గమనిస్తోంది. మరి తమిళనాడులో ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- దినకరన్