ప్రచారం ముగిసింది....ఇక పోల్ మేనేజ్ మెంట్ మిగిలింది
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. సరిగ్గా ఐదుగంటలకు ప్రచారం ముగియడంతో ఇప్పటి వరకూ నంద్యాలలో మకాం వేసిన నేతలు ఇంక తట్టాబుట్టా సర్దుకుని అమరావతికి కొందరు, నియోజకవర్గాలకు కొందరు తరలి వెళుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగియడంతో ఇక పోల్ మేనేజ్ మెంట్ పై ప్రధాన పార్టీలన్ని దృష్టి సారించాయి. ప్రచారాన్ని నెలరోజుల పాటు నిర్వరామంగా కొనసాగించిన వైసీపీ, టీడీపీలు ఇక పోలింగ్ పైనే కన్నేశాయి. ఈ సాయంత్రమే బూత్ లవారీ ఏజెంట్ల నియామకాన్ని పార్టీ నేతలు చేపట్టనున్నారు. ఏజెంట్లు చివరి నిమిషంలో చేజారి పోకుండా ఉండేలా అత్యంత విశ్వసనీయ వ్యక్తులనే నియమిస్తున్నారు. వీరిని పోలింగ్ వరకూ తమ అధీనంలోనే ఉంచుకోవాలని రెండు ప్రధాన పార్టీలూ నిర్ణయించాయి. ఏజెంట్లను ప్రలోభపెట్టే అవకాశముండటంతో టీడీపీ, వైసీపీలు ఏజెంట్లకు ప్రత్యేక క్లాసుల పేరిట తమ వద్దనే ఉంచుకుంటున్నాయి. ఇక ప్రచారం సమయం గడువు ముగియడంతో పదిహేను రోజుల నుంచి నంద్యాలలోనే ఉండి ప్రచారాన్ని చేసిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, అమర్ నాధ్ రెడ్డి తదితరులు విజయవాడకు పయనమయ్యారు. అలాగే జగన్ కూడా నంద్యాల నుంచి బయలుదేరారు.
చుట్టుపక్కల గ్రామాల నుంచి.......
ఈరోజు సాయంత్రం తర్వాత నంద్యాల నుంచి స్థానికేతరులు వెళ్లిపోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో బయట వ్యక్తులు ఎవరు ఉన్నా అది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. అందుకోసమే నేతలందరూ నంద్యాల నుంచి బయలుదేరారు. నంద్యాలలో లాడ్జీలు సయితం ఇక ఖాళీ కానున్నాయి. నెల రోజుల నుంచి నంద్యాలలో స్థానికేతరులే ఎక్కువగా ఉంటున్నారు. ఎన్నికల కమిషన్ స్థానికేతరులు ఎవరూ ఉండకూడదని చెప్పడంతో చుట్టుపక్కల మండలాల నుంచి తమకు అత్యంత సన్నిహితులను నంద్యాలకు రప్పించుకుంటున్నారు. ప్రచారం ద్వార మైకులు మూగబోయినా.... రేపు కూడా అభ్యర్థులు కొందరిని కలుసుకునే అవకాశముంది. ముఖ్యంగా సామాజిక వర్గ నేతలను మరోసారి కలుసుకుని తమకు మద్దతివ్వాలని కోరనున్నారు. మొత్తం మీద నంద్యాలలో నెల రోజుల నుంచి మోగిన మోత ఇప్పుడు ఆగిపోయింది. జగన్ చివరి నిమిషం వరకూ నంద్యాలలో ప్రచారం చేశారు. ఐదుగంటలకు ఒక నిమిషం ముందు తన ప్రచారాన్ని జగన్ ముగించారు.