ప్రశాంత్ కిషోర్ వ్యూహం మేరకే జగన్......?
ప్రశాంత్ కిషోర్ వ్యూహం ప్రకారమే వైసీపీ అధినేత జగన్ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం చేపట్టినట్లు తెలిసింది. నంద్యాల ఉప ఎన్నికపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే నంద్యాలలో తన టీం ద్వారా ఐదు సార్లు సర్వే చేయించారు. ఐదు సర్వేల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తున్నట్లు తేలడంతో జగన్ ను చివరి నిమిషం వరకూ నంద్యాలలోనే ఉండాలని పేర్కొనడంతోనే జగన్ నంద్యాలలో 13 రోజుల పాటు మకాం వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత మూడు సార్లు నంద్యాలలో ప్రచారం చేస్తే చాలని జగన్ భావించారు. అందుకోసం తేదీలను కూడా ఖరారు చేసుకున్నారు. అయితే ఈ నెల మొదటివారంలో ప్రశాంత్ కిషోర్ టీం చేసిన సర్వేలో టైట్ పొజిషన్ రావడంతో జగన్ ను నంద్యాల వీడవద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు తెలిసింది.
ఇంటింటికీ ఓట్లు అడుగుతూ........
అందుకోసమే ఈ నెల 9వ తేదీ నుంచి ఈరోజు వరకూ జగన్ నంద్యాలలోనే ఉన్నారు. దాదాపు 13 రోజుల పాటు ఆయన ఏకబిగిన నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా రోడ్ షోలతో పాటు, వివిధ సామాజిక వర్గ నేతలతో సమావేశమై ఓట్లు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదివారమయితే జగన్ నంద్యాల పట్టణంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న 35, 36, 37 వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడం విశేషం. ప్రతి గడపకూ వెళ్లి ఒక ప్రతిపక్ష నేత ఓట్లు అడగటం ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మరి జగన్ చేసిన నంద్యాలలో చేసిన ప్రచారం ఫలిస్తుందా? శిల్పా గట్టెక్కే అవకాశాలున్నాయా? అన్నది వేచి చూడాల్సిందే.
- Tags
- నంద్యాల జగన్