బాబు గల్ఫ్ యాత్ర రద్దు : వార్ధ ఏర్పాట్లే ప్రధానం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన గల్ఫ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వార్ధ తుపాను ప్రభావం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా చాల తీవ్రంగా ఉండే వాతావరణం కనిపిస్తుండడంతో అయన పర్యటన రద్దు చేసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలను, ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూసే ఏర్పాట్లను పర్యవేక్షించడంలోను నిమగ్నం అయిపోయారు.
ఏపీ ప్రభుత్వం లోని మంత్రులంతా తుపాను పర్యవేక్షక చర్యల్లో నిమగ్నం అయ్యారు. నెల్లూరు కలెక్టరేట్ లో వార్థా తుఫాను మీద సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేసారు.
తుపాను వివరాలు ఇలా ఉన్నాయి. వార్ధా తుఫాను నెల్లూరుకు తూర్పు దిశగా 300 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గూడూరు, సూళ్లూరు పేట నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో తుఫాను ప్రభావం. 16 సబ్ స్టేషన్లు, 222 చెరువులు దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తుఫాను సమర్ధంగా ఎదుర్కొనేందుకు 3 జాతీయ విపత్తు నిర్వహణ దళాలు సిద్ధంగా ఉంచారు. 200 మంది అగ్నిమాపక సిబ్బందిని రెడీగా ఉంచారు. 120 మంది పోలీసు సేవాదళ్ సభ్యులను, గజ ఈతగాళ్లను సంసిద్ధం చేశారు. నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల్లో సిద్దంగా ఉంచారు.
తుపాను తీవ్రత కరెంటు కష్టాలు ఎలా ఉంటాయో అనే ఉద్దేశంతో, 300 ఓవర్ హెడ్ ట్యాంకులను నింపి సిద్ధంగా ఉంచారు.. 150 షెల్టర్లతో పాటుగా, మరో 450 పాఠశాలలను సిద్ధం చేశారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నారు. కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసారు. ఎలాంటి విపత్కర పరిస్థితినయినా సమర్థంగా ఎదుర్కొనడానికి అన్ని శాఖల సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.