బ్రేకింగ్ : సుజనాపై చంద్రబాబు సీరియస్
మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అరుణ్ జైట్లీని కలిశారు. పోలవరానికి కావాల్సిన నిధులను విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రమంత్రులను ఎందుకు కలవాల్సి వచ్చిందని సుజనాను చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం పార్లమెంటు సభ్యులు, మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం తమను ఏదో రకంగా తప్పుదోవ పట్టిస్తుందని, కేంద్రం ట్రాప్ లో పడవద్దని చంద్రబాబు పార్లమెంటు సభ్యులను హెచ్చరించినట్లు తెలిసింది. ఇలా కేంద్రమంత్రులను ఇప్పుడు కలిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీలో ఇంత గొడవ జరుగుతున్నా ఈశాన్య రాష్ట్రాలకు నిన్న మూడు వేల కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జనసేన, వైసీపీ, బీజేపీ కలిసి మహాకుట్రకు తెరలేపాయని చంద్రబాబు స్పష్టం చేశారు. అవిశ్వాసంపై స్పీకర్ ను కలిసినా ప్రయోజనం లేకపోయిందని ఈ సందర్భంగా సుజనా చౌదరి చెప్పారు. ఈరోజు కూడా పార్లమెంటు వెలుపల, బయట నిరసనలు వ్యక్తం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సీట్లలోనే ఉండి నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు ఎంపీలకు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో కేంద్రమంత్రులను ఎవరూ కలవొద్దని ఆయన గట్టిగానే ఎంపీలను హెచ్చరించారు. అయితే తాను కావాలని అరుణ్ జైట్లీ ని కలవలేదని, పార్లమెంటులో ఆయన ఎదురుపడి పోలవరానికి నిధులు విడుదల చేస్తామని తనతో అన్నారని ఆయన చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు సమాచారం.