భూమాకు ఇది ముళ్ల కిరీటమేనా?
నంద్యాల ఉప ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డికి ఇంటా, బయటా సవాళ్లున్నాయి. కీలక ఎన్నికల్లో అందరూ తలా ఓ చేయి వేసి గెలిపించారు. నెల రోజులు జరిపిన కృషి ఫలితంగా భూమాకు అనూహ్య విజయం లభించింది. అయితే ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేని భూమా బ్రహ్మానందరెడ్డి ప్రస్తుతం నిన్న మొన్నటి వరకూ నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాలకు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయనకు ఇక ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఈ స్వల్ప కాలంలోనే ఆయనను ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సోదరి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నంద్యాలలో భూమా కుటుంబ పరంపరను కొనసాగించాలంటే భూమా బ్రహ్మానందరెడ్డి కష్టపడక తప్పదంటున్నారు.
సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు తప్పవా?
అయితే నంద్యాలలో దాదాపు 1600 కోట్ల అభివృద్ధి పనులను ఎన్నికలకు ముందు అధికార పార్టీ శంకుస్థాపనలు చేసింది. వాటన్నింటినీ ప్రస్తుతం బ్రహ్మానందరెడ్డి గ్రౌండ్ చేయించాల్సి ఉంది. అందులో ప్రధానమైనది గృహనిర్మాణం. లబ్దిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక మరో ప్రధాన విషయం నంద్యాల రోడ్ల విస్తరణ. రోడ్ల విస్తరణలో భవనాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం విషయం కూడా చూడాల్సి ఉంది. రహదారి పనులను సత్వరం పూర్తి చేయాల్సిన బాధ్యత బ్రహ్మానందరెడ్డిపైనే ఉందంటున్నారు నంద్యాలవాసులు. దీంతో పాటు సొంత పార్టీ వారిని సంతృప్తి పర్చాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందే మంత్రి అఖిలప్రియకు, భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడైన ఏవీ సుబ్బారెడ్డితో వచ్చిన అభిప్రాయబేధాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా కొత్త కావడంతో ఎమ్మెల్సీ ఫరూక్ కూడా నంద్యాల రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం తప్పక చేస్తానంటున్నారు ఆయన వర్గీయులు. ఎంపీ ఎస్పీవై రెడ్డి సహకారంతో కూడా ముందుకు వెళ్లాలి. ఇలాంటి సమస్యల నేపథ్యంలో కేవలం ఒకటిన్నర సంవత్సరానికి భూమా నెత్తిన ముళ్ల కిరీటం పెట్టారా? అన్న చర్చ నంద్యాలలో జరుగుతోంది. చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుకాకపోయినా జనాలు భూమానే నిలదీసే పరిస్థితి ఉంటుంది.