భూమాలేని లోటు ఈ అక్కాతమ్ముళ్లు తీర్చారు
గత ఎన్నికల్లో తండ్రే అంతా చూసుకున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఇప్పుడు పోలింగ్ మేనేజ్ మెంట్ బాధ్యత భూమా కూతురు, కొడుకు తీసుకున్నారు. మంత్రి అఖిలప్రియ సోదరి నాగమౌనిక, సోదరుడు విఖ్యాత్ రెడ్డి ఈ ఎన్నికల్లో అంతా తామే అయి చూసుకున్నారు. నంద్యాల పోలింగ్ ప్రారంభమయిన దగ్గర నుంచి సమస్యాత్మక ప్రాంతాల్లో భూమా నాగమౌనిక, విఖ్యాత్ రెడ్డి పర్యటించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఇద్దరూ చదువుకుంటున్న వారే. రాజకీయాలు తెలియదు. నిన్న మొన్నటి వరకూ తండ్రి చాటు బిడ్డలే. కాని పెను విషాదం వారి కుటుంబంలో నింపింది. తల్లీదండ్రులను కోల్పోయారు. రాజకీయాలంటే తెలియని పరిస్థితుల్లో నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. ప్రచారమంటే చేశారు. ఓటు వేయమని అడగటమే కాబట్టి అందులో ఎటువంటి అనుభవం అక్కర లేదు. కాని పోలింగ్ రోజు భూమా నాగిరెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నది వారు చూశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ......
భూమా నాగిరెడ్డి పోలింగ్ సమయంలో తమకు కొంత ఇబ్బంది ఉంటుందన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా పర్యటించేవారు. అక్కడ పోలింగ్ కేంద్రాల వద్దనే తిరిగేవారు. ఫ్యాక్షన్ గ్రామాలు కాబట్టి రిగ్గింగ్ లు జరిగే అవకాశముంటుందని భావించి భూమా అన్ని జాగ్రత్తలూ తీసుకునే వారు. కాని ఇప్పుడు తండ్రి బాధ్యతను ఈ అక్కాతమ్ముళ్లు తీసుకున్నారు. బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి నాగమౌనిక గ్రామీణ ప్రాంతాలతో పాటు నంద్యాల పట్టణంలో పర్యటించారు. వివిధ పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ ఓటింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే నంద్యాల పట్టణంలో విఖ్యాత్ రెడ్డి వైఎస్ఆర్ కాలనీలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. భూమా పిల్లలు పోలింగ్ కేంద్రాల వద్దకు రావడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. మొత్తం మీద ఈ అక్కాతమ్ముళ్లు ఉపఎన్నిక పోలింగ్ సమయంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
- Tags
- అక్కాతమ్ముళ్లు