ముద్రగడ దూకుడుకు అదే కారణమా ...?
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దూకుడుగా ముందుకు వెళ్ళడానికి కారణం కాకినాడ ఎన్నికలే కారణమా ..? అవుననే అంటున్నారు విశ్లేషకులు . ప్రభుత్వానికి చుక్కలు చుపించాలన్నా కీలెరిగి వాత పెట్టాలన్నా ఇంతకు మించి సమయం లేదని భావించిన ముద్రగడ ఆకస్మికంగా పాదయాత్రకు బయల్దేరారు .అలా చేస్తే పోలీసులు తనను అరెస్ట్ చేయక తప్పదని , అలా జరిగితే కాపులు ఆగ్రహంతో కాకినాడ ఎన్నికల్లో అధికారపార్టీకి దెబ్బ కొట్టే అవకాశాలు వుంటాయని భావించి కార్పొరేషన్ ఎన్నికల ప్రచార ముగింపు రోజు ముహూర్తం పెట్టుకున్నట్లుగా పలువురు భావిస్తున్నారు . రాజకీయాల్లో కాకలు తీరిన ముద్రగడ ఉద్యమాలను రచించడంలో కూడా దిట్ట .
అధికార పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి ...
కీలకమైన తరుణంలో ఇప్పుడు ముద్రగడ పై ఏ మాత్రం కఠినంగా వ్యవహరించలేని పరిస్థితిలో ప్రభుత్వం పడిపోయింది . అరెస్ట్ చేసి జైల్లో పెడితే 28 న కాకినాడ ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అన్న భయం టిడిపి ని వెంటాడుతుంది . అందుకే ఆయన్ను అరెస్ట్ చేశామని ప్రకటించి ఎక్కడ పెట్టారో చెప్పకుండా జిల్లా అంతా ఊరేగిస్తున్నారు పోలీసులు . సోమవారం నంద్యాల ఎన్నికల్లో తీర్పును బట్టి ముద్రగడ వ్యవహారంలో ఏవిధంగా ముందుకు వెళ్ళాలి అనే వ్యూహాన్ని ప్రభుత్వం ఖరారు చేసి పోలీసుల ద్వారా అమలు చేయించనుంది . ఇప్పటికే కాకినాడలో కాపు సామాజిక వర్గీయులకు స్వయంగా ఫోన్ చేసి టిడిపి కి తప్ప ఏపార్టీకి అయినా ఓట్లు వేయండని ఆయన సాగించిన ప్రచారం ఒక పక్క హడలెత్తిస్తుంటే. తాజాగా ముద్రగడ పన్నిన ఉచ్చులో పడి అధికారపార్టీ గిల గిల లాడుతుంది . ఆయన్ను అరెస్ట్ చేసి తిరిగి ఇంటికి పంపడమే బెటర్ అంటూ కాకినాడ ఎన్నికల్లో నిలబడ్డ క్యాడర్ ఇప్పటికే పార్టీ అధిష్టానానికి నివేదిస్తుంది. దాంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి లా సర్కార్ పరిస్థితి మారింది .
- Tags
- ముద్రగడ