మురుగుకాల్వల్లోనూ కాసుల వేట
అనంతపురం జిల్లాలో మురుగునీటిలో కాసులు ఏరుకుంటున్నారు. కాల్వల పూడిక పేరుతో అధికార పార్టీ అడ్డంగా దోచేయడానికి రెడీ అయందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. పూడిక తీత పేరుతో లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నారని పెద్దయెత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. అనంతపురం పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ ఈ అవినీతికి తెరలేపింది. ప్రజాప్రతినిధుల జోక్యంతోనే ఈ అవినీతి బాగోతం జరుగుతున్నట్లు అర్ధమవుతున్నా ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అనంతపురం కార్పొరేషన్ లో తొలినుంచి ఏ పనులుచేపట్టినా వివాదాస్పదంగానే మారుతున్నాయి. గతంలోనూ 500 పనులపై కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు ఎం.బుక్స్ లేకుండానే బిల్లులు చేసుకున్నారన్న ఆరోపణలపై కలెక్టర్ సీరియస్ అయి విచారణకు ఆదేశించారు.
ఇంత దారుణమా?
ఈ విచారణ జరుగుతుండగానే తాజాగా పూడిక తీత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూడిక తీత అంచనాలే వివాదాస్పదంగా మారాయి. అనంతపురం పట్టణంలోని 55 కాల్వల్లో పూడిక తీసేందుకు 77 లక్షల రూపాయలతో ప్రతిపాదనలను రూపొందించారు. టెండర్లను కూడా పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొన్ని కాల్వల్లో పూడిక తీత పనులు ప్రారంభమయ్యాయి. రోజూ మున్సిపల్ కార్మికులు తీసే కాల్వలను కూడా ఈ టెండర్లలో చేర్చడం వివాదమయింది. చిన్న చిన్న కాల్వలను కూడా టెండర్లలో చేర్చారు. పట్టణంలోని వేణుగోపాల్ నగర్ లో కాల్వ లోతే మీటరు కంటే ఎక్కువ ఉండదు. సాయినగర్ ఆరో క్రాస్ రోడ్డు నుంచి అమ్మవారి కొట్టాల వరకూ ఉన్న కాల్వను రెండుగా విభజించి లక్షల రూపాయలు పూడిక తీతకోసం కేటాయించారు. కాని ఈ కాల్వలో పూడిక తీయడానికి కూడా వీలులేదు. స్థానికులు కాల్వ మీదే మెట్లను నిర్మించుకుని ఉండటంతో వాటిని తొలగించడానికి కూడా వీలుకాదు. అలాంటి వాటిని కూడా టెండర్లలో చేర్చి నిధుల స్వాహాకు అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారు. దీనిపై విపక్షాలు పెద్దయెత్తున పోరాటం చేయాలని నిర్ణయించాయి. మొత్తం 17 పనుల్లో ఈ అవినీతి బాగోతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనంతపురంలో పూడికతీత పనుల్లో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని అనంతపురం ప్రజలు కోరుతున్నారు.
- Tags
- అనంతపురం