లోకేష్ కు త్వరలో బుగ్గకారు?
టీడీపీ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం సమీపించినట్లే ఉంది. తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న నారా లోకేష్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో లోకేష్‌ను క్యాబినెట్లోకి తీసుకోనున్నట్లు పార్టీ సీనియర్ సహచరులకు ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ సందర్భంగా కార్యకర్తల సంక్షేమ నిధిపై చర్చించే సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నిజానికి లోకేష్‌ను క్యాబినెట్లో తీసుకోవాలంటూ ఇటు పార్టీ నుంచి అటు కుటుంబం నుంచి ముఖ్యమంత్రిపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది.
ఎమ్మెల్సీ పదవి ఇచ్చి....
పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా లోకేష్‌కు పార్టీ బాధ్యతలు తప్ప మరో పదవి లేకపోవడం ప్రతిపక్షాలకు కలిసి వస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి వర్గంలో చేర్చుకుంటారనే ఊహాగానాలు రేగుతున్నాయి.లోకేష్‌ను మంత్రి వర్గంలో చేర్చుకుంటే పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలకు కేంద్రం ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించేలా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో చర్చిస్తామన్నారు.