సీనియర్లకు ఇక ‘చేతి’ నిండా పనే
సీనియర్ నేతలకు పనిలేకపోతే డేంజర్ అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఏ పనీ లేకుంటే సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం..వర్గాలను తయారు చేసుకోవడంలో సీనియర్లు ఉండటంతో వారికి ప్రత్యేకంగా ఒక పనిని కేటాయించాలని భావిస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రచించేందుకు,దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు కమిటీలు వేసి వాటికి సీనియర్లకు అప్పగించాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. దీని వల్ల పార్టీ కార్యక్రమాలు ఊపందుకోవడమే కాకుండా...పార్టీలో ఐక్యత కూడా పెరుగుతుందని హైకమాండ్ భావిస్తోంది.
కమిటీల ఏర్పాటు....
ప్రస్తుతం ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా పీసీసీయే చూసుకుంటుంది. పీసీసీ ఇచ్చిన పిలుపుకు కొందరు నేతలు స్పందింస్తున్నారు. కొందరు అసలు అటు వైపు చూడటం లేదు. వారికి నచ్చితే కార్యక్రమానికి వస్తారు. లేకుంటే లేదు. ఎందుకు రాలేదు అని అడిగే వీలు కూడా లేని పరిస్థితి. ఇది గమనించిన పార్టీ హైకమాండ్ వివిధ వర్గాలు, వివిధ సమస్యలపై కమిటీలు వేసి వాటి బాధ్యతను సీనియర్లకు అప్పగించాలని పీసీసీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. దీనివల్ల పొన్నాలే అందరినీ సమన్వయం చేయడం వల్ల కొంతమేర కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇదే తరహాలో సింగరేణి సమస్యలపై, ఐటీఐఆర్ ప్రాజెక్టు జాప్యంపై, నీటిపారుదల ప్రాజెక్టుల రీ డిజైనింగ్, ఎస్సీ, ఎస్టీ సమస్యలు, విద్యార్థి సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలపై కమిటీలను ఏర్పాటు చేసి వాటి బాధ్యతను సీనియర్లకు అప్పగిస్తారు. వీరే నిరసన కార్యక్రమాలను ఖరారు చేయడం, తేదీలు ప్రకటించడం, ముఖ్యనేతలను ఆహ్వానించం వంటివిచేస్తారు. సో...ఇక కాంగ్రెస సీనియర్లకు చేతినిండా పనే. అధిష్టానం వేసిన ఎత్తుగడ భలే బావుంది కదూ....