సీమ నేతలు సీరియస్
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిపై చిర్రుబుర్రులాడుతున్నారు. కేవలం అధికారులకే సీఎం పరిమిత మవుతున్నారని.... వారి మాటలు వింటూ తమను పట్టించుకోవడం లేదన్నది సీనియర్ల వాదన. చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని....ఆయన మునుపటి లాగే వ్యవహరిస్తున్నారంటున్నారు. ప్రధానంగా రాయలసీమ లోని సీనియర్ నేతల్లో ఈ అంసతృప్తి పెల్లుబుకుతోంది.
చూసీ చూడనట్లు
నిన్నగాక మొన్న ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మహాత్మాగాంధీ కాదని...ఆయన్ను చూసి జనం రారని కూడా జేసీ వ్యాఖ్యానించారు. కేవలం అధికారుల చేతుల్లో బాబు పావుగా మారారని కూడా జేసీ అన్నారు. జేసీ వ్యాఖ్యలను పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ఒకరిద్దరు ఖండించినా అధిష్టానం సీరియస్ గా తీసుకోలేదు. జేసీ వ్యాఖ్యలు సద్దుమణగకముందే...మరో సీనియర్ నేత డిప్యూటీ సీఎం కర్నూలులో చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. చంద్రబాబు అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదన్నది కేఈ ఆరోపణ. ఎన్టీఆర్ హయాంలో తాను నాలుగున్నరేళ్లు నీటిపారుదల ప్రాజెక్టు మంత్రిగా పనిచేశానని,..ఆయన పనుల్లో తాత్సారం చేసేవారు కారని...కాని బాబు మాత్రం పనులపై దృష్టి పెట్టడం లేదని కేఈ కుండబద్దలు కొట్టేశారు. దీంతో సీనియర్లలో అసంతృప్తి ఏ మేరకు ఉందో తెలిసి పోతోంది. కేఈ వ్యాఖ్యలను కూడా పార్టీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోన్నట్లు ఉంది. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కేఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. బాధ్యత కల్గిన పదవిలో ఉండి సీఎంపై కామెంట్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. కేఈని తనను కలవాల్సిందిగా కూడా బాబు కోరారట. ఈ విషయంలో కేఈతోనే ముఖాముఖి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. మొత్తం మీద అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ల గోల చంద్రబాబుకు తలనొప్పిగానే మారింది.