హైవేలపై ఇక మీరు మద్యం తాగలేరు
ఇక జాతీయ రహదారులపై మద్యం వాసన సోకదు. జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న మద్యం దుకాణాలను, బార్లను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నిబంధనలను కఠినతరం చేస్తోంది. హైవేలకు 500 మీటర్ల దూరంలో ఉన్న బార్లు, మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి ఈనిర్ణయం అమల్లోకి వచ్చేలా ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది.
75 శాతం హైవేలపైనే......
ఏపీలో మొత్తం 746 బార్లు ఉండగా అందులో 541 బార్ అండ్ రెస్టారెంట్లు జాతీయ రహదారులపై ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ తాజాగా జరిపిన సర్వేలో వెల్లడయింది. రాష్ట్రంలో 4170 వైన్ షాపులుండగా అందులో 3183 వైన్ షాపులు హైవే కు ఆనుకునే ఉన్నట్లు తేలడంతో వీటిని నిరోధించేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. జాతీయ రహదారిపై మద్యం దుకాణాలు, బార్లు ఉంటున్నందున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనం నడిపి రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో సుప్రీంకోర్టు జాతీయ రహదారికి 500 మీటర్లు లోపు ఉన్న బార్లను, మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. కాని ఎక్సైజ్ వేలం పాట గడువు ముగియక పోవడంతో ఏప్రిల్ 1వ తేదీ వరకూ ఏపీ ప్రభుత్వం అనుమతి కోరింది. కొన్ని బార్ల లైసెన్సులు గత ఏడాది డిసెంబర్ లోనే ముగిసినా...మార్చి వరకూ ఎక్సైజ్ శాఖ పొడిగించింది. కొన్ని మద్యం దుకాణాలకు ఈ ఏడాది జూన్ వరకూ లైసెన్సు గడువు ఉంది. అయితే మార్చి నాటికి లైసెన్సు లన్నింటినీ రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ నుంచి కొత్త పాలసీని ఏపీ ప్రభుత్వం తీసుకురానుంది. ఇక జాతీయ రహదారులపై 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలకు, బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వరు.