Fri Nov 22 2024 20:21:40 GMT+0000 (Coordinated Universal Time)
UGADI 2023 : ఉగాది రోజున షడ్రుచుల పచ్చడి ఎందుకు తినాలి ?
ఉగాది పచ్చడిలో కారంకోసం పచ్చిమిరపలను ఉపయోగిస్తారు. కొంతమంది పచ్చి మిరపకాయల బదులు మిరియాలు, పచ్చి కారం కూడా..
ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులు కలగలిపిన పచ్చడి. మనిషి జీవితంలో సుఖ దు:ఖాల మేలు కలయికకు ఈ ఉగాది పచ్చడినే ఉదాహరణగా చూపిస్తారు. ఇందులో ఉండే ఒక్కో రుచికి ఒక్కో కారణమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వసంతకాలం ఆగమనంలో వచ్చే మార్పులు వల్ల అనారోగ్యాలు దరచేరకుండా ఈ ఉగాది పచ్చడిలోని పదార్ధాలు శరీరాన్ని కాపాడతాయి. ఉగాది పచ్చడి శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలని హరిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
ఈ పచ్చడిలో పోషకాలు వ్యాధుల నుండీ రోగాల నుండీ రక్షిస్తాయి. ఈ పచ్చడిలో తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అనే ఆరు రుచులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్టే జీవితంలోని కష్ట సుఖాలనూ, ఎగుడుదిగుళ్ళనూ, మంచి చెడులనూ సంయమనంతో స్వీకరించాలన్నది అందులో ఉన్న పరమార్థమని చెబుతారు.
వేప పువ్వుల చేదు, బెల్లం తీపి, మామిడి వగరు, పచ్చిమిర్చితో కారం, ఉప్పు, చింతపండు పులుపు కలగలిపితే ఉగాది పచ్చడి తయారవుతుంది. వేపపువ్వుల నుంచి వచ్చే చేదుకి అర్థం ఏంటంటే.. జీవితంలో సుఖపడాలంటే కష్టాలను ఎదుర్కోక తప్పదు. ముందు కష్టపడితే కానీ.. తర్వాత సుఖం రాదని ఈ చేదు సూచిస్తుంది.
అలాగే బెల్లంలో ఉండే తీపి.. జీవితంలో ఆనందానికీ, సంతోషానికీ, సంతృప్తికీ సూచకంగా చెబుతారు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థని బెల్లం బలోపేతం చేస్తుంది. బెల్లంలో ఉండే జింక్, సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేసి ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ ని అడ్డుకుంటాయి. ఉగాదికి వచ్చే మామిడి కాయలు వగరుగా ఉంటాయి. ఇవి జీవితంలో వచ్చే ఆటుపోట్లకు సూచిక. ప్రతి వ్యక్తీ సుఖదుఃఖాలకు లోబడి ఉండాలని దాని అర్థం.
ఉగాది పచ్చడిలో కారంకోసం పచ్చిమిరపలను ఉపయోగిస్తారు. కొంతమంది పచ్చి మిరపకాయల బదులు మిరియాలు, పచ్చి కారం కూడా వినియోగిస్తారు. ఇది ఇమ్యూనిటీని పెంచి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. జీవితంలో వచ్చే కష్టాలకు ఉగాదిపచ్చడిలో ఉండే కారాన్ని ఉదాహరణగా చూపిస్తారు. అలాగే ఉప్పు. ఏ ఆహారంలోనైనా ఉప్పులేకపోతే దాని టేస్టే ఉండదు. రుచి లేని జీవితం ఉప్పు లేని వంటలాగే చప్ప చప్పగా ఉంటుంది. ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే.. తక్కువైనా ప్రమాదమే. అలాగే జీవితంలో కూడా ప్రతి ఎమోషన్ ను తట్టుకుని నిలబడాలని ఉప్పు సూచిస్తుంది. ఉగాది పచ్చడిలోని పులుపు చింత పండు నుండి వస్తుంది. కొత్త చింతపండు వచ్చే కాలం ఇది. చింతపండులోని పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులనీ అవసరాలనీ సూచిస్తుంది. ఈ ఆరురుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. జీవితంలో కూడా ఇలాగే సుఖదుఃఖాలు, కష్టసుఖాలు, మంచిచెడులుంటాయి.
Next Story