Wed Apr 02 2025 07:06:36 GMT+0000 (Coordinated Universal Time)
Ugadi : ఉగాది రోజున చేయకూడని పనులివేనట
ఉగాది రోజున ఏయే పనులు చేయాలి. ఏయే పనులు చేయకూడదు. చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పర్వదినం జరుపుకోవడం అనాదిగా వస్తోన్న సాంప్రదాయం. బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించిన రోజే ఉగాది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఉగాది పర్వదినంతో ప్రకృతిలోనూ మార్పులు జరుగుతాయి. చెట్లు కొత్త చిగురువేసి, పూత ఆరంభమవుతుంది. అలాగే సువాసనతో గుబాళించే మల్లెపువ్వులు ఉగాది నుంచి వస్తాయి. ఈ ఏడాది మార్చి 30వ తేదీ ఆదివారం నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలు కానుంది. కాగా.. ఉగాది రోజున చాలామంది తెలియక కొన్నిపొరపాట్లు చేస్తుంటారు. ఉగాది రోజున ఏయే పనులు చేయాలి. ఏయే పనులు చేయకూడదు. చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి.
ఉత్తరాదిన ఇలా....
ఉగాది రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలటంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆచారం లేదు కానీ ఉత్తర భారత దేశంలో హిందువులు ఉగాది రోజున ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు. ఉగాది పర్వదినం రోజున ఖచ్చితంగా కొత్తబట్టలు వేసుకోవాలి. మన తెలుగు సంవత్సరానికి ఇదే ఆరంభం. ఆరోజు ఎలా అయితే ఉంటామో సంవత్సరమంతా అలానే ఉంటామని ప్రతీతి. ఉగాది నాడు షడ్రుచుల పచ్చడి ఖచ్చితంగా తినాలి. ఈ పచ్చడితో నవగ్రహాలకు కూడా సంబంధం ఉంటుంది. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు.
పండగ రోజున...
ఉగాది రోజున సూర్యోదయం తర్వాత.. పొద్దెక్కేంతవరకూ పడుకోవడం మంచిది కాదు ఈ పండుగ రోజున మాంసాహారం, మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. చిరిగిన, మాసిపోయిన, పాతబట్టలను ధరించరాదు. ఉన్నంతలో కొత్తసంవత్సరాది రోజున మంచి బట్టలు ధరించాలి. ముఖ్యంగా దక్షిణ ముఖం కూర్చుని పంచాగ శ్రవణం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే స్నానం ఆచరించి వంటగదితో పాటు దేవుడి గదిని శుభ్రపర్చుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా ఉగాదిని ఆనందంగా అందరూ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ ఉగాది అందరి ఇళ్లలో ఆనందంతో పాటు సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుందాం.
Next Story