Mon Dec 23 2024 15:33:08 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది
రష్యాతో వైరం పెట్టుకోవడానికి ముందు 27 ఐరోపా దేశాలు ఉక్రెయిన్ ను ఎంతో నమ్మించాయి. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి
మనలో నమ్మకం ఉండాలి. మనకు ఆ సత్తా ఉందనుకోవాలి. అప్పుడే యుద్ధానికి కాలు దువ్వాలి. పక్క వారిని నమ్మి పోరాడితే ఏమవుతుందో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కి స్పష్టంగా తెలిసి వచ్చింది. నమ్మించిన వారే నట్టేట ముంచారని ఆయన ఇప్పుడు వాపోయినా ఫలితం లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రష్యా దాదాపు ఆక్రమించుకునే దిశగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వాన్ని మార్చాలన్న ఉద్దేశ్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు.
27 దేశాలు....
రష్యాతో వైరం పెట్టుకోవడానికి ముందు 27 ఐరోపా దేశాలు ఉక్రెయిన్ ను ఎంతో నమ్మించాయి. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. పుతిన్ అంత త్వరగా యుద్ధానికి దిగడని చెప్పాయి. అసాధారణ పరిస్థితులు సంభవిస్తే తాము మద్దతిస్తామని చెప్పాయి. ఆ ధైర్యంతో్నే ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాకు వ్యతిరేకంగా కాలు కదిపారు. నాటోలో సభ్యత్వం కావాలని పట్టుబట్టారు. పుతిన్ పై కయ్యానికి సిద్ధమని సంకేతాలను పంపారు.
అండగా ఉంటాయని భ్రమించి....
ఇదంతా తన వెంట అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఐరోపా దేశాలన్నీ ఉంటాయని భావించారు. అక్కడే ఆయన తప్పు చేశారు. యుద్దం ప్రారంభమైన తర్వాత ఏ ఒక్క దేశమూ సైన్యాన్ని ఉక్రెయిన్ కు మద్దతుగా పంపలేదు. రష్యాపై ఆంక్షలను విధించడంతో సరిపెట్టేశాయి. తనకు బలగాలు, ఆయుధాలు కావాలని ఎంత వేడుకున్నా వారు మాత్రం ముందుకు రాలేదు. దీనికి రష్యా అంటే భయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు కూడా.
చివరకు ఇలా....
తాము ఒంటరిగా పోరాటం చేయడానికి కారణం నాటో దేశాలేనని ఆయన విమర్శలు చేశారు. రష్యా బలగాలతో తన ఆయుధ సంపత్తి సరిపోదని జెలెన్ స్కీకి తెలియంది కాదు. అయినా ఇతర దేశాలు తనకు మద్దతిస్తాయని, పుతిన్ వెనక్కు తగ్గుతారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. నమ్ముకున్న దేశాలు మొహం చాటేశాయి. ఇప్పుడు రష్యాదే ఆధిపత్యం అయింది. ఇక చర్చలకు సిద్ధమని ప్రకటించక పరిస్థితి ఏర్పడింది. తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధికారులతో పుతిన్ సిద్ధమని ప్రకటించింది. అంటే అక్కడ ప్రభుత్వాన్ని మార్చేందుకే పుతిన్ సిద్ధమయ్యారని భావిస్తున్నారు. నలుగురిని నమ్మి నట్టేట మునిగిన జెలన్ స్కీకి ఇది పెద్ద గుణపాఠంగా చెప్పుకోవాలి.
Next Story